Nellore: నెల్లూరు జిల్లాపై తుపాను ఎఫెక్ట్.. ఫ్యాక్టరీలో చిక్కుకున్న కార్మికులు
Nellore - Heavy Rains Effect: *స్తంభించిన జనజీవనం *ఉప్పొంగి ప్రవహిస్తున్న స్వర్ణముఖి
Nellore - Heavy Rains Effect: తుపాను తీరం దాటినప్పటికీ నెల్లూరు జిల్లాలో వర్షాలు మాత్రం పడుతూనే ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో స్వర్ణముఖి సహా ఉపనదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. సూళ్లూరుపేటలోని పలు ఫ్యాక్టరీల్లో పనిచేస్తున్న 500 మందికి పైగా కార్మికులు వరద నీటి ప్రవాహంలో చిక్కుకున్నారు.
ఇప్పటికే ఆ ప్రాంతానికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలు.. సహాయక చర్యలు చేపట్టాయి. మరోవైపు.. స్వర్ణముఖి ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో నాయుడుపేట - వెంకటగిరి మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి.
ఇంకోపక్క.. కాళంగి నది 16 గేట్లు ఎత్తివేయడంతో ఆ వరద సూళ్లూరుపేట సమీప ప్రాంతాలను ముంచెత్తుతోంది. 16వ నెంబరు జాతీయ రహదారిపై నీటి ప్రవాహం పొంగిపొర్లుతోంది. దీంతో అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం.. రాకపోకలకు అంతరాయం ఏర్పడకుండా చర్యలు తీసుకుంటోంది.
ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేపట్టారు. మరోవైపు.. వేలాది ఎకరాల పంట పొలాలు.. నీట మునిగాయి. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు.