AP Election Results: ఏపీలో ఫలితాలపై రూ. కోట్లలో బెట్టింగ్‌లు..
AP Election Results: ఇప్పటి వరకు కోడి పందాలు.. ఎడ్ల పందాలు..చూశాం... మరీ మోడ్రన్‌గా అంటే ఈ మధ్య కాలంలో ఐపీఎల్ బెట్టింగ్‌లు కూడా వింటున్నాం.
AP Election Results: ఇప్పటి వరకు కోడి పందాలు.. ఎడ్ల పందాలు..చూశాం... మరీ మోడ్రన్‌గా అంటే ఈ మధ్య కాలంలో ఐపీఎల్ బెట్టింగ్‌లు కూడా వింటున్నాం. వీటన్నింటినీ తలదన్నేలా ఇప్పుడు ఏపీలో పొలిటికల్ బెట్టింగ్‌లు మొదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముగిశాయి.. ఓట్లు లెక్కించేందుకు సమయం చాలా ఉండటంతో బెట్టింగ్ రాయుళ్ళకు పండుగ వచ్చినట్లే అయ్యింది. ఏపీ ఎన్నికల్లో ఫలానా లీడర్ గెలుస్తాడని ఒకరంటే.. మెజారిటీ వేలల్లో ఉంటుందని మరొకరు పందెం కాస్తున్నారు.
ఏపీలో ఏ పార్టీ గెలవబోతుంది, ఎవరికి ఎంత మెజార్టీ వస్తుంది, గెలుపోటములపై కాయ్ రాజా కాయ్ అంటున్నారు. అభ్యర్థుల గెలుపు, ఓటములపై బెట్టింగ్ కడుతున్నారు. ఓట్ల జాతర ముగియడంతో పందెం రాయుళ్లకు పండుగ వచ్చింది. రాష్ట్రంలో ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి? అధికారంలోకి వచ్చేదెవరు? ఉత్కంఠ రేకెత్తిస్తోన్న ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ బాబులు రెచ్చిపోతున్నారు. పెద్ద మొత్తంలో పందెం కాస్తున్నట్లు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీపై 1:5 నిష్పత్తిలో అంటే లక్షకు 5 లక్షల రూపాయలు బెట్టింగ్ పెడుతున్నట్లు సమాచారం. పిఠాపురం, భీమవరం, మంగళగిరి, పులివెందుల, కుప్పం స్థానాలపై పెద్ద మొత్తంలో బెట్టింగ్ నడుస్తున్నట్లు తెలుస్తోంది. మంగళగిరిలో గెలిచేదెవరు? కడప ఎంపీ స్థానం ఎవరికి దక్కుతుంది..? భీమిలిలో పరిస్థితి ఏంటి? ఇలా కొన్ని ప్రత్యేక స్థానాలపై బెట్టింగులు జరుగుతున్నట్లు సమాచారం.
కోడిపందేలకు పేరుగాంచిన ఉమ్మడి గోదావరి జిల్లాల్లో బెట్టింగ్ రాయుళ్లు లక్షల్లో కాయ్ రాజా కాయ్ అంటున్నట్లు వినికిడి. చోటా నేతలు, కొందరు వ్యాపారులు మధ్యవర్తుల అవతారమెత్తినట్లు తెలుస్తోంది. ఎవరు గెలిచినా తమకు ఒకటి నుంచి 5 శాతం కమీషన్ ఇవ్వాలని మాట్లాడుకుంటున్నట్లు చెబుతున్నారు. సినీ, రాజకీయ, వ్యాపార రంగాల వారితోపాటు ప్రైవేటు ఉద్యోగులు, యువకులు, చిరు వ్యాపారులు 50 వేల నుంచి కోటి రూపాయల వరకు పందెం కాస్తున్నట్లు వినికిడి. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటయ్యే ప్రభుత్వంపైనే ఎక్కువగా పందాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఏపీ రాజకీయాల్లో సంచలనం సృష్టించిన నేతలు, ప్రజాదరణ భారీగా ఉన్న నాయకులు, నిత్యం వివాదాలతో చర్చనీయాంశమైన ప్రజాప్రతినిధులు బరిలో ఉన్నచోట భారీగా పందేలు సాగుతున్నట్లు సమాచారం. అన్నింటి కంటే పిఠాపురం హాట్ సీట్‌గా మారిందని టాక్. కుప్పం, పులివెందులలో మెజారిటీపై బెట్టింగులు పంటర్లకు కాసులు కురిపిస్తున్నట్లు సమాచారం. గతం కంటే మెజారిటీ తగ్గుతుందని ఒకరు పందెం పెడితే కాదు పెరుగుతుందని మరికొందరు బెట్టింగ్ వేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.
పవన్ కళ్యాణ్ పోటీచేసిన పిఠాపురంపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. పిఠాపురంలో గెలుపోటములు ఒకరకమైన బెట్టింగ్ అయితే.. మెజార్టీపై లక్షల్లో పందేలు జరుగుతున్నట్లు సమాచారం. ఇక లోకేష్ బరిలో ఉన్న మంగళగిరిపై పందేం రాయుళ్లు ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారని తెలుస్తోంది.. గత ఎన్నికల్లో లోకేష్ ఓడిపోవడంతో ఈసారి లోకేష్ గెలుపు పై ఎక్కువగా పందాలు జరుగుతున్నాయి.. అటు కడప జిల్లాలోను సీట్లు, మెజార్టీలపై జోరుగా బెట్టింగ్ నడుస్తోంది. కడప లోక్‌సభ బరిలో షర్మిల అభ్యర్థిగా దిగడంతో అందరి చూపులు కడప మీదే ఉన్నాయి. వైఎస్ ఫ్యామిలీ నుంచే ప్రత్యర్థులు బరిలో దిగడంతో ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తిగా మారింది. కడపలో ఎవరు గెలుస్తారు,.? ఎవరికి ఎంత మెజారిటీ వస్తుందన్న అంశాలపై జోరుగా బెట్టింగ్‌లు కాస్తున్నట్లు వినికిడి.
ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగితే తెలంగాణలో బెట్టింగ్‌లు జరగడం ఈసారి ఆసక్తికరంగా మారింది. హైదరాబాద్‌లో ఉండే ఏపీ వాళ్ళతోపాటు తెలంగాణ వాళ్ళుకూడా బెట్టింగ్‌లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ఏపీ వాళ్లు ఎక్కువగా నివాసం ఉండే కూకట్ పల్లి, కేపీహెచ్ బీ, మియాపూర్, శేరిలింగంపల్లి, వనస్థలిపురం, ఎల్బీ నగర్, దిల్‌సుఖ్‌నగర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, నిజాంపేట్, ప్రగతినగర్, ఉప్పల్ ఏరియాల్లో ఈ బెట్టింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఆఫ్ లైన్ తో పాటు ఆన్ లైన్ లోనూ పందేలు కొనసాగుతున్నాయి. వందకు వంద ఇస్తామని కొందరు పందేలు కాస్తుంటే.. వందకు నూటా యాభై ఇస్తామని మరికొందరు పందేలు కాస్తున్నారు.
వీటితో పాటు హైదరాబాద్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో ఎక్కువ శాతం ఉన్న ఏపీ వాళ్లు.. ఓ ప్రధాన సామాజిక వర్గానికి చెందిన వాళ్లు కూటమి అధికారంలోకి వస్తుందని బెట్టింగులు కడుతున్నారు. ఇక్కడ లక్ష బెట్టింగ్ కట్టి గెలిస్తే రూ.2లక్షలు చెల్లించేలా బెట్టింగ్ కాస్తున్నారు. ఇలా తెలంగాణ వ్యాప్తంగా రూ.2 వేల కోట్ల పందేలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. 175 సీట్లలో వైఎస్సార్సీపీ 110 సీట్లు దాటుతుందని ఎక్కువ మంది పందెం కట్టగా.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని మరికొంతమంది బెట్టింగ్ కట్టినట్లు తెలుస్తోంది.
బెట్టింగ్‌లో పల్నాడు, కృష్ణా, గుంటూరు జిల్లాలు టాప్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ జిల్లాల్లో అభ్యర్థులు చాలా మంది పోటా పోటీగా ఎన్నికల్లో ఖర్చు చేయడమే బెట్టింగ్‌లో రేటింగ్ పెంచింది. ఈ జిల్లాలతోపాటు ఎన్‌ఆర్‌ఐలు బరిలో ఉన్న సెగ్మెంట్లలో కూడా కోట్లలో బెట్టింగ్ జరిగినట్లు తెలుస్తోంది.. మరికొన్ని చోట్ల ఎకరాలకు ఎకరాలే బెట్టింగ్‌లో పెట్టినట్లు సమాచారం. మొత్తానికి ఎన్నికలు పూర్తయి గెలుస్తామా లేదా అన్న టెన్షన్‌లో అభ్యర్ధులు ఉంటే.. మరో పక్క కాయ్ రాజా కాయ్ పోటీలో గెలుస్తామా లేదా అని బెట్టింగ్ బంగారు రాజులు టెన్షన్ పడుతున్నారు. గెలిచేది ఎవరు..? ఓడేది ఎవరో తేలాలంటే జూన్ 4వ తేదీవరకు వేచి చూడాల్సిందే.