విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంతో హీటెక్కిన రాజకీయాలు

* రైతుల ఉద్యమం మాదిరి ఆందోళనలకు సిద్ధమవుతున్న పార్టీలు * కేంద్రం నిర్ణయాన్ని అడ్డుకునేందుకు ఒకే తాటిపైకి అన్ని పార్టీలు * స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ దుర్మార్గపు చర్య అంటున్న ప్రతిపక్షాలు

Update: 2021-02-08 04:19 GMT
స్టీల్ ప్లాంట్ (ఫైల్ ఇమేజ్)

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ అంశంతో ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఢిల్లీలో రైతుల ఉద్యమం మాదిరి పోరాటానికి రాష్ట్రంలోని పార్టీలన్నీ సన్నద్ధమవుతున్నాయి. స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేట్‌పరం చేయాలని చూస్తున్న కేంద్రం నిర్ణయాన్ని ఎలాగైనా అడ్డుకోవాలని భావిస్తున్నాయి. దీని కోసం ఒకే తాటి పైకి రాజకీయ పార్టీలన్నీ రానున్నాయి.

రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో పనిచేస్తున్న విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నుంచి వ్యూహాత్మకంగా 100 శాతం పెట్టుబడులకు సంబంధించి ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ అనుమతినిచ్చిందన్న అంశం గత కొద్ది రోజులుగా ఏపీలో తీవ్ర చర్చకు దారితీసింది. అయితే ఈ అంశంపై ఏపీ సర్కార్‌కు కేంద్రం నుంచి ఎలాంటి సమాచారం లేదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

సుమారు 20 వేల మందికి ప్రత్యక్షంగానూ, పరోక్షంగా మరెందరికో విశాఖ నగరంలో ఉపాధి కల్పిస్తూ ప్రభుత్వ రంగ సంస్థల్లో అతి పెద్దదిగా నిలుస్తోంది స్టీల్‌ ప్లాంట్. దేశంలో సముద్ర తీరప్రాంతంలో ఏర్పాటైన తొలి స్టీల్‌ ప్లాంట్‌గా పేరొందింది విశాఖ స్టీల్‌ ప్లాంట్‌. అత్యంత నాణ్యమైన ఉక్కును తయారు చేస్తూ, నిర్మాణ, మౌలిక వసతులు, ఉత్పత్తి రంగాలతో పాటు, ఆటోమొబైల్‌ రంగం అవసరాలు కూడా ఈ స్టీల్ ప్లాంట్ తీరుస్తోంది .

దీర్ఘకాల పోరాటం తర్వాత సాధించుకున్న సంస్థ విశాఖ స్టీల్ ప్లాంట్. దాదాపు దశాబ్ద కాలం పాటు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అన్న నినాదంతో ఉద్యమం కొనసాగింది. సుమారు 32 మంది బలిదానాల ద్వారా సాధించినదే విశాఖ స్టీల్ ప్లాంట్. అలాంటి సంస్థను ప్రైవేటీకరణ చేయటం దుర్మార్గపు చర్య అని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. మరోవైపు ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంది. కేంద్రం తన నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని కోరింది.

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ టీడీపీ సీనియర్‌ నేత గంటా శ్రీనివాసరావు ఇప్పటికే రాజీనామా చేశారు. అటు అధికార పార్టీ ఎంపీ కూడా రాజీనామాకు సిద్ధమని ప్రకటించారు. నాన్‌ పొలిటికల్‌ జేఏసీ ఏర్పాటు చేసి ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని, ఈ సెగ ఢిల్లీ వరకు తాకాలని అన్ని పార్టీల నేతలు అంటున్నారు. మరి ఈ అంశంలో కేంద్రం నిర్ణయం ఏ విధంగా ఉండబోతోంది చూడాలి. 

Full View


Tags:    

Similar News