ఇవాళ సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్లపై విచారణ
Chandrababu: క్వాష్ పిటిషన్, ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ
Chandrababu: స్కిల్ డెవలప్‌మెంట్ కేసును కొట్టేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో చంద్రబాబు తరపు లాయర్లు స్పెషల్ లీవ్ పిటిషన్‌ను దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరగనుంది. జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ధర్మాసనం ఈ కేసులో వాదనలు విననుంది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ పిటిషన్‌పై కూడా విచారణ కొనసాగనుంది.
చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే, ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్‌రోహత్గీ ధర్మాసనం ముందు వాదనలు వినిపించనున్నారు. గత శుక్రవారం కోర్టు పనివేళలు ముగిసే సమయానికి రాష్ట్ర ప్రభుత్వ వాదనలు పూర్తికానందున తన వాదనలను పూర్తిచేయడానికి మరో అరగంట సమయం కావాలని సీనియర్ న్యాయవాది ముకుల్‌రోహత్గీ కోర్టును సమయం అడిగారు.
ఈ నేపథ్యంలో మంగళవారానికి వాయిదా వేసిన ధర్మాసనం ఇవాళ విచారణ ప్రారంభమైన వెంటనే రోహత్గీ వాదనలు విననుంది. ముకుల్‌రోహత్గీ వాదనలు పూర్తైన వెంటనే సాల్వే కౌంటర్ వాదనలు ప్రారంభించనున్నారు. ఈ సాయంత్రానికల్లా అన్నిపక్షాల వాదనలు ముగిసే అవకాశం ఉంది. ఆ తర్వాత ధర్మాసనం తీర్పు రిజర్వు చేస్తుందా? లేదంటే ఇంకేమైనా నిర్ణయం తీసుకుంటుందా అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది.