Amaravati: నేటి నుంచి ఏపీలో ఒంటి పూట బడులు
Amaravati: ఒక వైపు కరోనా.. మరో వైపు ఎండలతో రాష్ట్ర వ్యాప్తంగా నేటి నుంచి ఒంటి పూట బడులు నిర్వహిస్తున్నారు.
Amaravati: ఏపీలో కరోనా సెకండ్ వేవ్ దడపుట్టిస్తోంది. కొత్తకేసులు భారీగా నమోదు అవుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో లాక్ డౌన్ కూడా విధిస్తున్నారు. దీనిని బట్టి రాష్ట్రంలో కరోనా తీవ్రత ఎంతో అర్థమౌతోంది. మరో వైపు భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఒకటి నుంచి 10వ తరగతి విద్యార్థులకు నేటి నుంచి ఒంటిపూట బడులు నిర్వహిస్తున్నారు. ఉదయం 7.45 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు తరగతులు ఉంటాయి. ఆ తర్వాత యథావిధిగా మధ్యాహ్న భోజనం ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని పాఠశాలల్లో కోవిడ్-19 నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. ఈ నేపథ్యంలో నేటి నుంచీ ఒంటి పూడ బడులు నిర్వహిస్తున్నారు.
పెరుగుతోన్న కరోనా కేసులు...
నిన్న ఏపీలో 1,184 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో పాజిటివ్ కేసుల సంఖ్య 9,01,989కి చేరింది. వీరిలో ఇప్పటివరకు 8,87,434 మంది డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 24 గంటల్లో 456 మంది డిశ్చార్జ్ అవగా.. ప్రస్తుతం రాష్ట్రంలో 7,738 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రంలో గత 24గంటల్లో నలుగురు మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 7,217కి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 1,50,83,179 శాంపిల్స్ పరీక్షించినట్లు ఏపీ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.
వడగాలులు వీచే అవకాశం...
అటు ఎండలు కూడా దంచి కొడుతున్నాయి. ఉక్కపోతతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రానున్న రోజుల్లో ఎండల తీవ్రత మరింత పెరగనున్నట్లు వాతావరణశాఖ అధికారుల తెలిపారు. రాగల 48 గంటల్లో ఏపీలో పెద్ద ఎత్తున వడగాల్పులు వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె.కన్నబాబు చెప్పారు. ఏప్రిల్ 1న రాష్ట్రంలోని 113 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 217 మండలాల్లో వడగాల్పులు ప్రభావం ఉంటుందని వెల్లడించారు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ... వడగాల్పుల నుండి రక్షణ పొందుతూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.