ఏపీలో ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిస్తే ఇక అంతే? రాజకీయ జీవితం క్లోజ్ !
1994 నుంచి ఇక్కడ గెలిచిన అభ్యర్థి మళ్లీ తిరిగి ఎక్కడ గెలిచిన దాఖలాలు లేవు. రాజకీయంగా కూడా వెలుగులో ఉన్న పరిస్థితులు అస్సలే లేవు.
ఆ నియోజకవర్గంలో పోటీ చేయాలంటే ధైర్యం ఉండాలి. అక్కడ గెలిచిన వారు ఒక్కసారికి మాత్రమే పరిమితం అవుతారు. రెండోసారి గెలవాలంటే ఎంతో కొంత ప్రాప్తం ఉండాలి. లక్కు కలసి రావాలి. ఇప్పటి వరకు ఆ అదృష్టం ఇద్దరికి మాత్రమే దక్కింది. ఇక్కడ పోటీ చేసి గెలిచిన ఐదేళ్లు వాళ్లదే రాజ్యం. ఓ వెలుగు వెలుగుతారు. ఆ తర్వాత రాజకీయాల్లో కనుమరుగవుతారు. ఒకవేళ ఏ పార్టీలోనైనా ఉంటే, గుర్తింపు అంతంత మాత్రమే. ఈ నియోజకవర్గం నుంచి హేమహేమీలు పోటీ చేసి ఇలాగే ఎటూ కాకుండా పోయారు. ఇంతకీ ఏంటా అన్‌లక్ కానిస్టెన్సీ.?
ఇందాక మనం చెప్పుకున్న నియోజకవర్గం గుంటూరు జిల్లాలో ఉంది. అదే గుంటూరు పశ్చిమ. 1955లో అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పడిన గుంటూరు వెస్ట్ ఎంతోమందికి రాజకీయ భిక్ష పెట్టింది. ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచిన వారెంత మంది ఉన్నారో .. ఓడిన వారు కూడా అంతే మంది ఉన్నారు.1955 నుంచీ. 2014 వరుకు ఎమ్యెల్యేగా గెలిచిన నాయకులు మంచి పదవులు అనుభవించిన వారు సైతం లేకపోలేదు. సీన్ కట్ చేస్తే ఆ తరువాత మళ్లీ గనుక ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఓటమి తప్పదు.
1994 నుంచి ఇక్కడ గెలిచిన అభ్యర్థి మళ్లీ తిరిగి ఎక్కడ గెలిచిన దాఖలాలు లేవు. రాజకీయంగా కూడా వెలుగులో ఉన్న పరిస్థితులు అస్సలే లేవు. 1962, 1967లో చేబ్రోలు హనుమయ్య కాంగ్రెస్ నుంచి రెండుసార్లు గెలిచారు. 1985,1989లో మళ్లీ కాంగ్రెస్ నుంచి జయరాంబాబు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వీళ్లిద్దరు మినహా మరెవరూ రెంండోసారి పోటీ చేసి గెలిచిన దాఖలాలు లేవు.1999లో శనక్కాయల అరుణ టీడీపీ తరపున ఇక్కడి నుంచి గెలిచి చంద్రబాబు క్యాబినెట్‌లో మంత్రి అయ్యారు. డాక్టర్ వృత్తిలో మంచి పేరు ఉన్న అరుణ, ఆ తరువాత రాజకీయాల్లో అంతంత మాత్రంగానే ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయంగా పూర్తిగా కనుమరుగయ్యారు.
2004లో కాంగ్రెస్ నుంచి తాడిశెట్టి వెంకట్రావు విజయం సాధించి దివంగత వైఎస్ హయాంలో గుంటూరు పశ్చిమ నియోజకవర్గాన్ని ఒక ఊపు ఊపారు. ఆ తరువాత రాజకీయలకు పూర్తిగా దూరమయ్యారు. తాడిశెట్టి కుటుంబంలో కొంతమంది రాజకీయాల్లో ఉన్నారు కానీ వెంకట్రావు రాజకీయంగా ఏ కార్యక్రమల్లో పాల్గొన్న దాఖలాలు కనపడలేదు. ఇక కన్నా లక్ష్మీనారాయణ విషయానికి వస్తే వరుస విజయాలతో దూసుకుపోతున్న కన్నాకు ఇక్కడ ఎమ్యెల్యేగా గెలిచిన తర్వాత నుంచి మళ్లీ ఎన్నికలలో గెలుపు అనే మాటకు దూరం అయ్యారు. పెదకూరపాడు నుంచి నాలుగుసార్లు గెలుపొందిన కన్నా 2019 గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి గెలుపొంది రెండుసార్లు మంత్రిగా పనిచేశారు.
రాష్ట్రం విడిపోయిన తరువాత 2014 ఎన్నికల్లో కన్నా లక్ష్మీనారాయణ మొదటిసారి ఓటమిని చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. కన్నా ఓటమికి ఈ ఐరన్ లెగ్ పశ్చిమ నియోజకవర్గమే కారణమన్న అభిప్రాయాలు ఉన్నాయి. ప్రస్తుతం బీజేపీలో ఉన్నా 2014 నుంచి ఆయనకి గెలుపనేది లేకుండా పోయింది. ఇక మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి విషయానికి వస్తే.... 2009 ఎన్నికల్లో నరసరావుపేట టీడీపీ అభ్యర్థిగా గెలుపొందారు. రాష్ట్ర విభజన తరువాత వచ్చిన 2014 ఎన్నికల్లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ కూడా అధికారంలోకి వచ్చింది. కానీ 2019లో అనూహ్య పరిణామాలతో మోదుగుల వైసీపీలో చేరి గుంటూరు వైసీపీ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేశారు. పశ్చిమ నియోజకవర్గం ప్రభావం మోదుగులపై కూడా పడి ఓటమి పాలయ్యాడు. వైసీపీ అధికారంలో ఉన్నా కూడా ఓడిన దగ్గర నుంచి మోదుగుల, గతంలోలాగా రాజకీయంలో అంత చురుకుగా కనపడట్లేదు.
ఇక- ప్రస్తుత పరిస్థితులు చూసుకుంటే. 2019 ఎన్నికల్లో టీడీపీ తరపున మద్దాలి గిరి, వైసీపీ తరుపున చంద్రగిరి ఏసురత్నం గుంటూరు పశ్చిమ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. వైసీపీ అభ్యర్థి చంద్రగిరి ఏసురత్నంపై టీడీపీ నుంచి పోటీ చేసిన మద్దాలి గిరి గెలుపొందారు. ఆ తర్వాత మద్దాలి గిరి వైసీపీ తీర్థం పుచుకున్నారు. మరి రానున్న రోజుల్లో ఈ గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఐరెన్ లెగ్ ప్రభావం మద్దాలి గిరిపై పడనుందా? లేక రికార్డ్‌ను బ్రేక్ చేసి రాబోయే ఎన్నికల్లో గెలుపొందుతారా? ఈ ఐరన్ లెగ్ ప్రభావం ఎంత వరకు పనిచేస్తుందో తెలుసుకోవాలంటే కొన్నాళ్లు వేచి చూడాల్సిందే.