Andhra Pradesh: గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డి బదిలీ
Andhra Pradesh: గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి బదిలీ అయ్యారు. అయితే ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు.
Andhra Pradesh: గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డిని బదిలీ అయ్యారు. అయితే ఆయనకు ఇంకా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. ప్రస్తుతానికి మంగళగిరి పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్టు చేయాలని సూచించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌దాస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో గుంటూరు అర్బన్ ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్ ను నియమించారు. ఆరిఫ్ హఫీజ్ ప్రస్తుతం గుంటూరు జిల్లా రూరల్ ఎస్ఈబీలో అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్నారు.
త్వరలో జరగబోయే ఐపీఎస్‌ల బదిలీల్లో అమ్మిరెడ్డిని కీలకమైన జిల్లాకు ఎస్పీగా పంపిస్తారని ప్రచారం జరుగుతున్న వేళ.. ఆయనకు అసలు పోస్టింగే ఇవ్వకుండా డీజీపీ కార్యాలయానికి రిపోర్ట్ చేయాలని ఆదేశాలు జారీచేయడం హాట్‌టాపిక్‌గా మారింది. ఎంపీ రఘురామకృష్ణరాజు ఇటీవల కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ ను కలిసి ఎస్పీ అమ్మిరెడ్డిపై ఫిర్యాదు చేయడం తెలిసిందే.
తనపై ఎస్పీ అమ్మిరెడ్డి, సికింద్రాబాద్ సైనిక ఆసుపత్రి రిజిస్ట్రార్ కేపీ రెడ్డి, టీటీడీ జేఈఓ ధర్మారెడ్డి కుట్రకు తెరదీశారని రఘురామ ఆరోపించారు. అందుకు తగిన ఆధారాలను కూడా ఆయన రాజ్నాథ్ కు సమర్పించినట్టు వార్తలొచ్చాయి. ఈ ఘటన జరిగిన రెండు రోజుల వ్యవధిలోనే అమ్మిరెడ్డి ఆకస్మికంగా బదిలీ కావడం చర్చనీయాంశమైంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతోనే ఆయనపై చర్యలు తీసుకుని ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది.