Tadepalli Rape Case: తాడేపల్లి బాధితురాలికిచ్చిన చెక్ బౌన్స్
Tadepalli Rape Case: తాడేపల్లి బాధితురాలికిచ్చిన చెక్ బౌన్స్ అవ్వడంతో ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు నెటిజన్లు
Tadepalli Rape Case: అసలే జరిగినదానికి తల దించుకోవాల్సిన పరిస్ధితి. అగ్నికి ఆజ్యం తోడవటం అంటే ఇదేనేమో. తాడేపల్లిలో గ్యాంగ్ రేప్ జరిగినందుకు.. వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్ధితుల్లో ఏపీ సర్కార్ పడింది. అందుకే దిశ యాప్ గురించి స్వయంగా సీఎం జగనే ప్రచారంలోకి దిగారు. ఆయన శ్రమను వృధా చేసే వ్యవహారం ఒకటి అధికారులు చేశారు. గ్యాంగ్ రేప్ బాధితురాలికి అప్పటికప్పుడు ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది. ఇప్పుడిది ప్రభుత్వం పరువు తీసినట్లయింది.
గుంటూరు జిల్లా ఐసీడీఎస్ అధికారుల తీరు. రాష్ట్రవ్యాప్తంగా సచలనం సృష్టించిన తాడేపల్లి అత్యాచారం ఘటనలో బాధితురాలికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.5లక్షల ఆర్ధిక సాయం అందించిన సంగతి తెలిసిందే. ఐతే గుంటూరు జీజీహెచ్ లో బాధితురాలికి చికిత్స అందుతున్న సయమంలో మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత ఆమెకు రూ.5లక్షల చెక్కు అందించారు. అదే సమయంలో గుంటూరు జిల్లా ఐసీడీఎస్ అధికారులు కూడా రూ.25వేల చెక్కును అందజేశారు. రూ.5లక్షల చెక్కును బాధితురాలి కుటుంబ సభ్యులు బ్యాంకులో డిపాజిట్ చేయగా.., నగదు వారి ఖాతాకు జమైంది. ఐతే ఐసీడీఎస్ ఇచ్చిన చెక్కు మాత్రం బౌన్స్ అయింది.
దీనిపై బ్యాంక్ సిబ్బంది.. ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఖాతాలో డబ్బు లేదని అందుకే బౌన్స్ అయిందని బ్యాంక్ అదికారులు వివరించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు బాధితురాలి కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి.. ఒకటి రెండు రోజుల్లో డబ్బు ఎకౌంట్లో వేస్తామని చెప్పినట్లు సమాచారం.
మరోవైపు ఘటన జరిగి దాదాపు రోజులు కావొస్తున్నా నిందితులు పోలీసులకు చిక్కలేదు. అధునాతన టెక్నాలజీ అందుబాటులో ఉన్నా గుంటూరు పోలీసులు సరిగా వినియోగించుకోలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈనెల జూన్ 19న ఘటన వెలుగులోకి రాగా.. పోలీసులు సరిగా దృష్టిపెట్టాలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.