Guntur Ggh Morchary: గుంటూరు జిల్లాను కరోనా మహమ్మారి గడగడలాడిస్తోంది. రోజురోజుకు మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. గుంటూరు జీజీహెచ్‌లోని మార్చురీ కరోనా మృతదేహాలతో నిండిపోయింది. కరోనాతో చనిపోయినవారిని తీసుకువెళ్లేందుకు బంధువులు భయపడుతున్నారు. దీంతో జీజీహెచ్ మార్చురీలో శవాలు కుప్పలు తెప్పలుగా పడి ఉన్నాయి. జీజీహెచ్ మార్చురీ లో 30 మృతదేహాలను భద్రపరిచే అవకాశముంది. కానీ ప్రస్తుతం ఈ మార్చురీలో 54 మృతదేహాలు ఉన్నాయి.
గుంటూరు జిల్లాలో ఇప్పటి వరకు వందమందికి పైగా కరోనా వైరస్ కు బలయ్యారు. కరోనాతో చనిపోయిన వ్యక్తుల కుటుంసభ్యులు సైతం క్వారంటైన్, కొవిడ్ కేర్ సెంటర్లు, ఆస్పత్రుల్లో ఉన్నారు. మరోవైపు కరోనా మృతదేహాల అంత్యక్రియల్లో పాల్గొన్న చాలామంది బంధువులకు సైతం కరోనా వైరస్ సోకింది. దీంతో కరోనా మృతదేహాలను మోసేందుకు 'ఆ నలుగురు'ముందుకురావడం లేదు. అందుకే కరోనా మృతదేహాలు మార్చురీలోనే ఉండిపోయాయి.
కరోనా మృతదేహాల అంత్యక్రియలకు ఇబ్బందులు కలుగకుండా జిల్లా అధికార యంత్రంగం ప్రణాళికలు రచిస్తోంది. అందులో భాగంగానే కరోనా మృతదేహాలను స్థానిక ఎమ్మార్వో ఆధ్వర్యంలో ఖననం చేసేలా చర్యలు తీసుకోనున్నారు. కరోనా మృతదేహాల అంత్యక్రియల బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందంటున్నారు జీజీహెచ్ సూపరింటెండెంట్ సుధాకర్.