AP Election Results 2024: గాజువాకలో వారసుల వార్... విన్నర్ ఎవరంటే..?
విశాఖపట్టణం జిల్లా గాజువాక అసెంబ్లీ స్థానంలో 35 ఏళ్ల క్రితం తండ్రులు తలపడితే ప్రస్తుతం కొడుకులు సమరమే అన్నారు.
విశాఖపట్టణం జిల్లా గాజువాక అసెంబ్లీ స్థానంలో 35 ఏళ్ల క్రితం తండ్రులు తలపడితే ప్రస్తుతం కొడుకులు సమరమే అన్నారు. గత చరిత్ర పునరావృతం అవుతుందా? కొత్త చరిత్ర సృష్టిస్తారా అనేది కొన్ని గంటల్లో తేలనుంది. ఈ స్థానంలో మంత్రి గుడివాడ అమర్ నాథ్ పై టీడీపీ అభ్యర్ధిగా పల్లా శ్రీనివాసరావు పోటీ చేశారు. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడడంతో ఆయా పార్టీలు, అభ్యర్ధులు లెక్కలు సరిచూసుకుంటున్నారు.
గాజువాక నియోజకవర్గం వైసీపీ, టీడీపీ అభ్యర్ధులు ఇద్దరికీ స్వంత నియోజకవర్గం. ఒకరు మంత్రైతే... మరొకరు సీనియర్ నేత. ప్రచారం నుంచి పోలింగ్ దాకా పకడ్భందీగా వ్యవహరించారు. నియోజకవర్గాల పునర్విభజనతో 2009లో గాజువాక అసెంబ్లీ ఏర్పాటైంది. మిని ఇండియాగా గాజువాకను పిలుస్తారు. 2009 నుండి మూడు పార్టీల అభ్యర్ధులు ఈ స్థానం నుండి గెలుపొందారు. 2009లో ప్రజారాజ్యం, 2014లో తెలుగుదేశం, 20219లో వైసీపీ అభ్యర్ధులు ఇక్కడి నుండి గెలుపొందారు. గత ఎన్నికల్లో జనసేనాని పవన్ కల్యాణ్ ఇక్కడి నుంచి పోటీచేసి పరాజయం పాలయ్యారు. 2019లో 65.33 శాతం పోలింగ్ నమోదవడంతో వైసీపీ అభ్యర్థి తిప్పల నాగిరెడ్డి 16,753 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.
క్యాస్ట్ ఈక్వేషన్లతో గాజువాకకు గుడివాడ
అధికార వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే నాగిరెడ్డిని తప్పించి యాదవ వర్గానికి చెందిన కార్పోరేటర్ చందును సమన్వయకర్తగా నియమించింది. కొత్త నాయకత్వంతో పార్టీని గెలుపు తీరాలకు చేర్చడం ఈజీ కాదని భావించారు సీఎం జగన్. గాజువాక నియోజకవర్గంలో కాపులు ఎక్కువగా ఉండటంతో మంత్రి గుడివాడ అమర్నాథ్ ను బరిలోకి దింపింది. బలమైన కాపు సామాజిక వర్గం, స్ధానికుడు కావడంతో నియోజకవర్గ ప్రజలతో ఆయన ఈజీగా కలిసిపోయారు. పీపుల్స్ మానిఫెస్టో పేరుతో గాజువాక అభివృద్ధి ప్రణాళికను ప్రకటించారు అమర్నాథ్. ఎమ్మెల్యేగా గెలిపిస్తే...ఏం చేస్తానో చెప్పేందుకు ప్రయత్నించారు. మహిళా ఓటర్లు, కార్మిక వర్గం ఓట్లు వైసీపీకే పడ్డాయని ఆ పార్టీ నాయకులు అంచనా వేస్తున్నారు. ఎమ్మెల్యే నాగిరెడ్డి వర్గం సహకరించకపోవడం, పార్టీలో అంతర్గత పోరు తమకు కలిసి వస్తుందని టీడీపీ నేతలు లెక్కలు వేసుకుంటున్నారు. జనసేన పోటీలో లేని కారణంగా కాపు సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ చీలిక వచ్చిందనే లెక్కలు వినిపిస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ అమ్మకం కారణంగా కూటమిని వ్యతిరేకించే ఓటింగ్ మొత్తం అధికార పార్టీకి షిఫ్ట్ అయ్యే అవకాశమే లేదు.
సింపతీ...ఓట్లు కురిపించిందా ?
సౌమ్యుడిగా ముద్ర ఉన్న పల్లా శ్రీనివాస్...సింపతీ, సాంప్రదాయ ఓట్ బ్యాంక్, బీసీ ఓటింగ్‌పై ఆధారపడ్డారు. ఇక్కడ జనసేన, బీజేపీకి పటిష్టమైన ఓట్ బ్యాంక్ ఉంది. అయితే ఎంత పర్సంటేజ్ పల్లాకు షిఫ్ట్ అయిందనేది కీలకం. స్టీల్ ప్లాంట్ కోసం నిరాహార దీక్ష చేయడం, అందుబాటులో ఉంటారనే అభిప్రాయం పల్లా శ్రీనివాసరావుకు కలిసి రానుందనే చర్చ లేకపోలేదు. దీనికి తోడు బీసీల ఓట్ బ్యాంక్, కాపులతో ఉన్న కుటుంబ సంబంధాలు...పల్లా శ్రీనివాస్‌కు అనుకూలిస్తాయని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేకత, ఉద్యోగులు, నిరుద్యోగులంతా తమ వైపే మొగ్గు చూపారని లెక్కలు వేసుకుంటున్నారు. జీవీఎంసీ ఎన్నికల్లో గాజువాక పరిధిలోని కీలక డివిజన్లలో టీడీపీ, కమ్యూనిస్టు పార్టీలకే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి. దీంతో ఈ ఓట్లపై టీడీపీ భారీగా నమ్మకం పెట్టుకుంది.
నాడు తండ్రులు...నేడు తనయులు...గెలిచేదెవరు ?
గాజువాక నియోజకవర్గంలో 3,33,611 మంది ఓటర్లు ఉన్నారు. పురుషులు లక్షా 67,112, మహిళలు లక్షా 66,457 మంది ఉన్నారు. 2024 ఎన్నికల్లో 2,32,949 ఓట్లు పోలవడంతో 69.83 శాతం నమోదైంది. 2019లో ఇక్కడ 2,02,094 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. 65.33% శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి దాదాపు నాలుగు శాతం ఎక్కువ పోలింగ్ జరిగింది. దీంతో పెరిగిన ఓట్లు ఎవరిని గెలిపిస్తున్నాయి...?. ఎవరికి షాక్ ఇస్తున్నాయనే విశ్లేషణలు మొదలయ్యాయి. ఇక్కడ ఎవరు గెలిచినా మరోసారి హిస్టరీ రిపీట్ అవుతుందనే లెక్కలు వేస్తున్నారు.1989 ఎన్నికల్లో పెందుర్తి అసెంబ్లీ నుంచి కాంగ్రెస్ తరపున గుడివాడ అమర్నాధ్ తండ్రి గురునాధరావు, పల్లా శ్రీనివాసరావు తండ్రి పల్లా సింహాచలం టీడీపీ నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికలో పల్లా సింహాచలంపై గురునాధరావు 19,903 ఓట్లు తేడాతో విజయం సాధించారు. తాజాగా ఎన్నికల్లో గుడివాడ అమర్నాధ్, పల్లా శ్రీనివాస్ ప్రత్యర్థులుగా తలపడ్డారు. దీంతో గాజువాక ఎవరికి విజయాన్ని అందిస్తున్న దానిపై ఉత్కంఠ రేపుతోంది.