అధ్యక్షుడికి అన్నీ అడ్డంకులే.. కాళ్లల్లో కట్టెలు పెడుతున్నది ఎవరు?
Somu Veerraju: ఏపీ బీజేపీలో ముసలం పుడుతోందా? అది అధ్యక్షుడికి కొత్త చిక్కులు తెప్పిస్తోందా?
Somu Veerraju: ఏపీ బీజేపీలో ముసలం పుడుతోందా? అది అధ్యక్షుడికి కొత్త చిక్కులు తెప్పిస్తోందా? రాజకీయ సమీకరణాల నడుమ అధ్యక్షుడిగా ఏరికోరి మరి నియమిస్తే కొందరు నేతలు ఆయన ఆదేశాలకు వ్యతిరేకంగా అడుగులు వేస్తున్నారా? ఏపీ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీని బలోపేతం చేయాలని వడివడిగా అడుగులు అడుగులు వేస్తున్న వేళ అడ్డుకుంటున్న సొంత పార్టీ నేతలు ఎవరు? మరి వీరి విషయంలో తీసుకునే నిర్ణయం ఏంటి? ఏపీ కమలంలో పైకి కనిపించని ఆ కొత్త కోణమేంటి?
ఏపీలో అధికార పార్టీ వైసీపీతో పాటు ప్రతిపక్ష టీడీపీలకు తామే ప్రత్యామ్నాయమని చెబుతున్న కమలం పార్టీ రాష్ట్రంలో బలోపేతం అవడానికి కార్యాచరణ సిద్ధం చేస్తుంటే కొందరు నేతలు రథసారథి సోము వీర్రాజుకి అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారట. ఏపీలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలను బీజేపీకి అనుకూలంగా మార్చుకునే క్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు స్థాయిలో పార్టీలో సమూల మార్పుల దిశగా అడుగులు వేస్తున్న వేళ ఏపీ బీజేపీలోని కొందరు నేతలు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహార్తిస్తున్నారట.
క్షేత్ర స్థాయిలో పార్టీ కార్యక్రమాల అమలుకు సోము వీర్రాజు కార్యాచరణ సిద్ధం చేస్తుంటే పార్టీలో రాష్ట్ర స్థాయి పదవులలో ఉన్న కొందరు నేతలు తిరుగుబాటు చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తరువాత కమిటీల నియామకం, జిల్లా స్థాయిలో అధ్యక్షుల మార్పు, అనుబంధ కమిటీలను నూతనంగా నియమించి పార్టీని గాడిలో పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంటే అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని కమల రథసారథి ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇప్పటికే అనేక అంశాల్లో తాను తీసుకున్న నిర్ణయాన్ని ధిక్కరించి వ్యవహరిస్తుండంటంతో పాటు పార్టీలో వర్గాలుగా విడగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని సోము వీర్రాజు భావిస్తున్నారట.
మరోవైపు తనకు వ్యతిరేకంగా పార్టీలోని కొందరు నేతలు తెర వెనుక చేస్తున్న ప్రయత్నాలపై సోము వీర్రాజు దృష్టికి తీసుకొని వచ్చారట కొందరు నేతలు. అధ్యక్షుడు సోము వీర్రాజు ఆదేశాలతో కమిటీల నియామకం పూర్తయ్యాక వారి బాధ్యతలు నిర్వర్తించే క్రమంలో సీనియర్లు కొందరు అడ్డుపడుతున్నారని కొందరు నేతలు అంటున్నారు. రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో కీలక బాధ్యతలు నిర్వర్తించే వారితో పాటు జిల్లాల స్థాయిలో కూడా ఇదే పరిస్థితి నెలకొందని, ఇప్పటికే ఇదే అంశాన్ని అధ్యక్షుడు దృష్టికి తీసుకుని వెళ్లారట. ఈ మధ్యకాలంలో కమిటీల నియామకం జరిగిన తరువాత బాధ్యతలతో సంబంధం లేకపోయినా, తమకి సమాచారం ఇచ్చి పార్టీ కార్యాచరణ అమలు చేయాలని కింది స్థాయిలో నేతలపై ఒత్తిడి చేస్తున్నారని బీజేపీలోని ఒక వర్గం నేతలు ఆరోపిస్తున్నారు. అధ్యక్షుడు ఆదేశాలతో కార్యక్రమాలు అమలు చేస్తుంటే మధ్యలో తాము సీనియర్లమని తాము చెప్పింది చేయాలని, తమపై ఒత్తిడి చేయడం ఏంటని వరుసగా ఫిర్యాదులు చేస్తున్నారట.
ఇదిలాఉంటే, బీజేపీలో ఎన్నడూ లేని విధంగా అధ్యక్షుడితో సంబంధం లేకుండా తెర వెనుక రాజకీయాలు చేయడం వెనుక బలమైన కారణాలు ఉన్నాయని అంటున్నారు కొందరు బీజేపీ నేతలు. గత కొంతకాలంగా సోము నాయకత్వం వ్యతిరేకిస్తున్న నేతలంతా ఇప్పుడు వ్యూహం మార్చి, కింది స్థాయిలో ఉన్న నేతలపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికే సోము వీర్రాజు పార్టీలో సమూల మార్పుల దిశగా అడుగులు వేయడం, కొత్త కమిటీలు నియమించడం, పార్టీలో సీనియర్లకు పెద్దపీట వేయడంలాంటి అంశాలు మింగుడు పడని నేతలు, అంత ఇప్పుడు వ్యూహాత్మకంగా అధ్యక్షుడికి వ్యతిరేకంగా పని చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇదే అంశాన్ని ఇప్పటికే సోము వీర్రాజు అధిష్టానం దృష్టిలో ఉంచారని, త్వరలోనే వారి బాధ్యతల విషయంలో నిర్ణయానికి వస్తారని చెప్పుకుంటున్నారు. రాష్ట్ర కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షుల స్థానంలో ఉన్న నేతలు ఇలా వ్యవహరించడంపై ఇటు సోము కూడా గుర్రుగానే ఉన్నారట. మరి తన నాయకత్వానికి, పార్టీలో నేతలకు, కార్యక్రమాలకు వ్యతిరేకంగా పావులు కదుపుతున్న నేతల విషయంలో సోము వీర్రాజు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.