శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో వైసీపీలో వర్గపోరు
* అసమ్మతి వర్గాన్ని మంత్రితో కలవనీయకూడదని ఎమ్మెల్యే వర్గం ప్రయత్నాలు
Sri Satysai District: శ్రీసత్యసాయి జిల్లా పెనుకొండలో వైసీపీ అసమ్మతి బహిర్గతమయింది. ఇంచార్జి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో సమీక్ష జరగాల్సి ఉండగా ముందుగానే వై జంక్షన్ వద్దకు అసమ్మతివాదులు చేరుకున్నారు. ఎమ్మెల్యే వర్గానికి పోటీగా మంత్రిని ఆహ్వానించేందుకు అక్కడికి వెళ్లిన వ్యతిరేకవర్గం నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. అంతేకాదు వై జంక్షన్‌లో రోడ్డుపై నిరసన తెలిపారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్ అక్కడికి వచ్చిన నేపథ్యంలో ఆందోళనకారులను పోలీసులు పక్కకు తరలించే ప్రయత్నం చేశారు. కాన్వాయ్ అక్కడికి రావడంతో ఒక్కసారిగా ఆందోళన కారులు రెచ్చిపోయారు.
అయవతే మాజీ మంత్రి ఎమ్మెల్యే శంకర్ నారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆందోళన వ్యక్తం చేశారు. కాన్వాయ్ కదులుతున్న సమయంలో ఆందోళనకారుల నుంచి చెప్పులు ఎగిరి పడ్డాయి. కాగా మరో వ్యక్తి చెప్పు చూపిస్తూ నిరసన వ్యక్తం చేశారు. మంత్రి కాన్వాయ్‌ని ఆపి ఆందోళనకారులను ఒక్కసారిగా పక్కకు తోసేశారు. మంత్రి కిందికి దిగడంతో అప్రమత్తమైన పోలీసులు పక్కకు నెట్టేశారు. అనంతరం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే శంకర్ నారాయణతోపాటు ఆ పార్టీ నేతలు పెనుకొండకు చేరుకొని సమీక్ష కొనసాగిస్తున్నారు.