Govt schools infrastructure changed with Nadu-Nedu scheme: ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు అనే లక్ష్యంతో జగన్ సర్కార్ నాడు-నేడు కార్యక్రమం చేపట్టింది. పాఠశాలల రూపురేఖలతో పాటు విద్యా బోధనలో మార్పు తీసుకొచ్చే విధంగా ప్రభుత్వం దృష్టిని సారించింది. ఈ పథకం ద్వారా పేద-మధ్య తరగతి విద్యార్ధులకు నాణ్యమైన విద్య లభించబోతోంది. అందులో భాగంగా బడులకు నిధులు కేటాయించింది. దాంతో గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు కొత్త రూపురేఖల్ని సంతరించుకున్నాయి.
ఉపాధ్యాయులు మూస ధోరణిలో కాకుండా కొత్త తరహాలో బోధిస్తేనే విద్యార్ధుల్లో ఆసక్తి పెరుగుతుంది. ప్రయివేటు పాఠశాల దోపిడిని అరి కట్టాలంటే ప్రభుత్వ పాఠశాలలను అదే స్థాయిలో మార్చాలి. ఒకప్పుడు కనీస మౌలిక సదుపాయాలు కూడా లేని స్కూళ్ల పరిస్థితి నుంచి నేడు అడుగడుగునా అభివృద్ధి కనిపిస్తోంది. విద్యార్ధులకు యూనిఫారమ్ పంపిణీ దగ్గర్నుంచి పుస్తకాలు, మధ్యాహ్న భోజనం పథకం వరకు వినూత్న మార్పులు చోటు చేసుకున్నాయి. అలాగే క్లాసుల్లో ఫర్నీచర్, టాయిలెట్లు కార్పొరేట్ హంగులతో ఏర్పాటు చేశారు. పాఠశాలల్లోని ఆవరణ ఆహ్లదకరంగా ఉండేటట్టు ఏర్పాట్లు చేశారు. విద్యార్దులకు మధ్యాహ్న భోజనంలో ఏడు రోజులు ఏడు రకాల వంటకాలతో పాటు ప్రతీరోజు ఓ స్వీటును అందించేందుకు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
గుంటూరు జిల్లాలో అనేక ప్రభుత్వ పాఠశాలలు చూడటానికి పూర్తిగా మారిపోయినాయి. పెదకూరపాడు మండలంలోని తాళ్లూరు గ్రామంలోని ప్రాధమిక పాఠశాల. ఇక్కడ దాదాపు 350 మంది పిల్లలు విద్యాభ్యాసం చేస్తున్నారు. నాడు-నేడులో పథకంలో భాగంగా ప్రభుత్వం ఈ స్కూలు ఎంపిక చేసుకొని 71 లక్షలు నిధులు కేటాయించింది. దీంతో ఆ స్కూలు రూపురేఖలు మారిపోయాయి. విశాలమైన తరగతి గదులు. గదుల్లో అందమైన గ్రానేట్స్, టైల్స్. సీలింగ్ మోడరన్ టాయిలెట్స్, విద్యార్ధులు కూర్చోడానికి టేబుల్స్, విశాలమైన ప్రార్ధన మందిరం, స్కూల్ లో సరస్వతి విగ్రహాం, విద్యార్ధులు ఆడుకోవడానికి విశాలమైన ప్లే గ్రౌండ్, రాష్ట్రంలో గుర్తింపు ఉన్న ప్రాజెక్టుల చిత్రాలను గోడలపై పేర్లతో సహా చిత్రీకరించారు. అలాగే పక్షుల బొమ్మలు, చిన్నారుల కోసం సూక్తులు గోడలపై రాశారు. పచ్చదనం, ఆహ్లాదకరమైన పరిసరాలతో స్కూల్ ను సుందరంగా తీర్చి దిద్దారు. ప్రభుత్వ పాఠశాలను ఓ రోల్ మోడల్ గా మార్చారు.
ప్రభుత్వం విద్య కోసం ఇన్ని కోట్లు ఖర్చు చేస్తున్నా పేదలు అప్పులు చేసి మరీ ప్రయివేటు విద్య కోసం ఎందుకు పరిగెడుతున్నారనే అంశం పైన ఫోకస్ పెట్టిన ప్రభుత్వం సమూలంగా మార్పులకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా పాఠశాలల్లో మౌళిక వసతుల ఏర్పాటుతో పాటుగా ఆంగ్లబోధన అమ్మఒడి వంటి పధకాల ద్వారా ప్రభుత్వ విద్యా బోధన తీరు తెన్నులనే మార్చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ప్రయివేటు విద్యలోనూ ఫీజుల పోటీ తగ్గే అవకాశం ఉంటుంది.