ఏపీలో పంచాయతీ ఎన్నికల వ్యవహారం మలుపులు మీద మలుపులు తిరుగుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన అనంతరం ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించేందుకు సిద్ధమైన ఎస్ఈసీ నిమ్మగడ్డకు ఊహించని షాక్ తగిలింది. ఈ సమావేశానికి హాజరుకావాలని నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ముందుగానే సమాచారం ఇచ్చినప్పటికీ ఏపీ సీఎస్ ఆదిత్యానాథ్ దాస్, డీజీపీ గౌతమ్ సవాంగ్, పంచాయతీరాజ్ శాఖ ఉన్నతాధికారులు ఈ సమావేశానికి హాజరుకాలేదు.
మరోవైపు ఐదు గంటల తరువాత వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరుకాని అధికారులు తీరుపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏ విధంగా వ్యవహరిస్తారన్నది ఉత్కంఠ రేపుతోంది. జిల్లాలకు సంబంధించిన అధికారులు సైతం ఈ భేటీకి హాజరుకాలేదు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్, ఎస్పీ అమిత్ బర్థార్, డీపీఓ లు వీడియో కాన్ఫరెన్స్‌కు డుమ్మా కొట్టారు. అంతేకాకుండా వీడియో కాన్ఫరెన్స్ రూమ్‌కు అధికారులు తాళం వేశారు. ఇక తమకు సహకరించాలని పదే పదే విజ్ఞప్తి చేస్తున్నా అధికారులు స్పందించకపోవడాన్ని నిమ్మగడ్డ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ మొత్తం వ్యవహారంలో రేపు గవర్నర్‌తో నిమ్మగడ్డ భేటీ కలిసే అవకాశం కనిపిస్తోంది. ఎన్నికల ప్రకటన, ప్రభుత్వ సహాయ నిరాకరణ అంశాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. అటు అధికారుల గైర్హాజరు అంశాన్ని గవర్నర్, కోర్టు దృష్టికి తీసుకెళ్లే అవకాశం కనిపిస్తోంది. అయితే గవర్నర్ అపాయింట్‌మెంట్‌పై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు.