అచ్చెన్నాయుడు అరెస్ట్ ఏపీలో హాట్‌టాపిక్‌గా మారింది. ఈఎస్‌ఐ స్కామ్‌లో అచ్చెన్నాయుడు పాత్ర ఉందని విజిలెన్స్ అధికారులు తేల్చటంతో ఆయన్ను అరెస్ట్ చేశారు. ఇంతకీ ఆయన అరెస్ట్‌లో కీలకంగా మారిన విజిలెన్స్ దర్యాప్తు ఏం చెప్తోంది..? ESI డిస్పెన్సరీలు, డయాగ్నోస్టిక్ కేంద్రాల్లో జరిగిన అవినీతిపై విజిలెన్స్ అందించిన నివేదికలో ఏముందో ఇప్పుడు చూద్దాం.
గత ప్రభుత్వ హయాంలో ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్ డైరెక్టర్లుగా డాక్టర్ బి.రవికుమార్, సీకే రమేష్‌కుమార్, విజయ్ కుమార్ ఆధ్వర్యంలోనే అక్రమాలు జరిగినట్లు విచారణలో గుర్తించారు విజిలెన్స్ అధికారులు. మందుల కొనుగోళ్లలో నాన్ రేటు కాంట్రాక్ట్ సంస్థలకు సంబంధించి దాఖలైన కొటేషన్లన్నీ నకిలీవే అని విచారణలో గుర్తించారు. కొటేషన్లు, వాటి కవర్లపై చేతి రాతలన్నీ ఒకేలా ఉండగా అవి డెరెక్టర్ ఆఫ్ ఇన్సూరెన్సు మెడికల్ సర్వీసెస్ సిబ్బంది హ్యాండ్ రైటింగ్‌గా తేల్చారు.
మందుల కొనుగోళ్లలో పర్చేజ్ ఇన్‌వాయిస్, సేల్ ఇన్‌వాయిస్‌ల ధరల్లో తేడాలున్నట్లు విజిలెన్స్ దర్యాప్తులో బయటపడింది. 2014 నుంచి ఐదేళ్లలో ఐఎంఎస్ డైరెక్టర్లు నాన్ రేట్ కాంట్రాక్ట్ సంస్థల నుంచి 89 కోట్ల 58 లక్షల విలువైన మందులు కొనుగోలు చేశారు. అవే మందులు రేట్ కాంట్రాక్ట్ సంస్థల నుంచి కొనుగోలు చేస్తే 38 కోట్ల 56 లక్షలకు వచ్చేవని దర్యాప్తులో తేలింది. అలా ఐదేళ్లలో సగటున 132.30 శాతం అధికంగా చెల్లించారు అధికారులు.
డాక్టర్ బి.రవికుమార్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు ఓపెన్ టెండర్లు పిలవకుండా నాన్ రేట్ కాంట్రాక్ట్ సంస్థల 237 కోట్ల విలువైన ల్యాబ్ కిట్స్ కొనుగోలు చేశారు. వీటికి 36 శాతం అధిక ధర చెల్లించారు. డాక్టర్ సీ.కే.రమేష్‌కుమార్ డైరెక్టర్‌గా ఉన్నప్పుడు నాన్ రేట్ కాంట్రాక్ట్ సంస్థల నుంచి 5 కోట్ల 71 లక్షల విలువైన ఔషధాలు కొనుగోలు చేశారు. ఫర్నీచర్ కొనుగోలులో ఐఎంఎస్ డైరెక్టర్లు 70 శాతం ఎక్కువ ధర చెల్లించినట్లు గుర్తించారు.
ఇక టెలి హెల్త్ సంస్థకు మాత్రమే కాంట్రాక్ట్ పనులు అప్పగించాలని అప్పటి కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు సీకే రమేష్‌కుమార్‌కు లేఖ రాసినట్లు వెల్లడించింది విజిలెన్స్ డిపార్ట్‌మెంట్. దీంతో టెండర్ లేకుండానే ఆ కంపెనీకి కాంట్రాక్ట్ అప్పగించారు. ఇందులో టోల్ ఫ్రీ సర్వీస్‌కు రోగులు చేసే ప్రతీ కాల్‌కు నెలకు రూపాయి 80 పైసలు, రోగులకు చేసే ప్రతి ఈసీజీకి 480 రూపాయల చొప్పున చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం ప్రకారం టెలీ హెల్త్ టోల్‌ఫ్రీ సర్వీస్, ఈసీజీ పరీక్షలకు దాదాపు 8 కోట్లు చెల్లించారు.
హైదరాబాద్‌కు చెందిన ప్రొడిగీ కంప్యూటర్స్–ల్యాప్‌టాప్స్ సంస్థ డిఐఎంఎస్‌కు 100 బయోమెట్రిక్ మెషిన్లు సరఫరా చేసింది. అయితే ఇందులో ఒక్కో బయోమెట్రిక్ మెషిన్‌కు 70 వేల 670 రూపాయలు చెల్లించారు. కానీ వాస్తవానికి మార్కెట్‌లో దాని ధర 16 వేల 992 మాత్రమే. ఇలా బయోమెట్రిక్ మెషిన్ల కోసం 53 లక్షల 67 వేలు అదనంగా చెల్లించారు.