IAS Officers: ఏపీ సీఎస్‌కు రిపోర్టు చేసిన నలుగురు ఐఏఎస్ అధికారులు
IAS Officers: ఆమ్రపాలి సహా నలుగురు ఐఎఎస్ అధికారులు గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ కు రిపోర్ట్ చేశారు.
IAS Officers: ఆమ్రపాలి సహా నలుగురు ఐఎఎస్ అధికారులు గురువారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ కు రిపోర్ట్ చేశారు. ఏపీ రాష్ట్ర కేడర్ కు కేటాయించిన ఈ నలుగురు ఐఎఎస్ అధికారులు వాణీప్రసాద్, రోనాల్డ్ రోస్, వాకాటి కరుణ, ఆమ్రపాలిలను తెలంగాణ నుంచి అక్టోబర్ 16న రిలీవ్ అయ్యారు.
వీరంతా ఆంధ్రప్రదేశ్ లో చేరుతారని తెలంగాణ రాష్ట్ర సచివాలయం నుంచి ఏపీ సచివాలయానికి మెయిల్ పంపారు. మరోవైపు తెలంగాణ కేడర్ కు చెందినప్పటికీ ఏపీలో పనిచేస్తున్న సృజన, హరికిరణ్, శివశంకర్ లు బుధవారం సాయంత్రమే తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతికుమారికి రిపోర్ట్ చేశారు.
ఏ రాష్ట్రానికి చెందిన కేడర్ అధికారులు అదే రాష్ట్రంలో రిపోర్ట్ చేయాలని డీఓపీటీ ఈ నెల 9న ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 16న తమకు కేటాయించిన రాష్ట్రాల్లో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. దీంతో ఏపీ కేడర్ కు చెందినప్పటికీ తెలంగాణలో పనిచేస్తున్న ఆమ్రపాలి, వాణీ ప్రసాద్, వాకాటి కరుణ, రోనాల్డ్ రోస్, మల్లెల ప్రశాంతి, ఐపీఎస్ అధికారులు అంజనీ కుమార్, అభిషేక్ మొహంతి, అభిలాష బిస్త్ ఏపీలో రిపోర్ట్ చేయాలని ఆదేశించింది.
ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ కేడర్ అధికారులు ఎస్. సృజన, శివశంకర్ లాహోటి, హరికిరణ్ లు తెలంగాణలో రిపోర్ట్ చేయాలని డీఓపీటీ కోరింది. ఈ ఆదేశాలను ఆమ్రపాలి సహా ఐఎఎస్ అధికారులు క్యాట్ లో సవాల్ చేశారు. అయితే డీఓపీటీ ఆదేశాల మేరకు నడుచుకోవాలని క్యాట్ ఆదేశాలు జారీ చేసింది. క్యాట్ ఉత్తర్వులపై అక్టోబర్ 16న తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశారు. అయితే క్యాట్ ఉత్తర్వులపై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్ ను కొట్టివేసింది. దీంతో ఐఎఎస్ అధికారులు డీఓపీటీ ఆదేశాలకు అనుగుణంగా తమ కేడర్ రాష్ట్రాల్లో రిపోర్ట్ చేయాల్సి వచ్చింది.