R5Zone: ఇళ్ల నిర్మాణాలకు సర్వం సిద్ధం.. శంకుస్థాపన చేయనున్న సీఎం జగన్
R5Zone: లబ్ధిదారులకు CRDA పరిధిలో ఇళ్లను నిర్మించి ఇవ్వనున్న ప్రభుత్వం
R5Zone: ఏపీ సీఎం జగన్ ఇవాళ రాజధాని గ్రామాల్లో పర్యటించనున్నారు. R5 జోన్‌లో పేదలకోసం ఇళ్ల నిర్మాణాలకు కృష్ణాయపాలెంలో సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. 50 వేల ఇళ్ల నిర్మాణాలకు ఒకేసారి శంకుస్థాపన చేయనున్నారు సీఎం. ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన పైలాన్‌ను ఆవిష్కరించి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ నేపథ్యంలో భారీ ఏర్పాట్లను చేసింది ప్రభుత్వం. రాజధాని గ్రామాల పరిధిలోని ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలకు చెందిన 50 వేల 793 మంది పేద ప్రజలకు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాల్లో నేటి నుంచి ఇళ్ల నిర్మాణం ప్రారంభం కానుంది. శంకుస్థాపన అనంతరం వెంకటపాలెంలో భారీ బహిరంగ సభలో పాల్గొంటారు సీఎం జగన్.
కృష్ణాయపాలెంలో 14 వందల 2 ఎకరాలను ఇళ్ల నిర్మాణానికి కేటాయించింది ప్రభుత్వం. మొత్తం 25 లే అవుట్‌లలో 18 వందల కోట్ల రూపాయలతో ఇళ్ల నిర్మాణం చేపట్టనుంది. లే అవుట్లలో మౌలిక వసతుల కల్పన కోసం మరో 384 కోట్ల 42 లక్షలు ఖర్చు చేయనుంది ప్రభుత్వం. లేఔట్లను అధునాతనంగా తీర్చిదిద్దేందుకు ఏర్పాట్లు చేయబోతోంది. 25 లే అవుట్లలో 45 ప్రాజెక్టులను అమలు చేయనుంది CRDA. ఈ ప్రాజెక్టుల పరిధిలో 73 కోట్ల 74 లక్షల రూపాయలతో 11 అంగన్‌వాడీ కేంద్రాలు.. 11 డిజిటల్ లైబ్రరీలు, 12 ఆస్పత్రులను నిర్మించనుంది. లే అవుట్‌ల పరిధిలో ఆహ్లాకరమైన వాతావరణం ఏర్పాటు చేసేందుకు 2 దశల్లో 168 లక్షలతో 28వేల మొక్కలు నాటాలని ప్రభుత్వం నిర్ణయించింది.
ఇక ఆర్5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాలను ముందు నుంచి అడ్డుకుంటూ వస్తున్న రాజధాని రైతులు ఇవాళ నిరసనలకు సిద్ధమయ్యారు. ఇప్పటికే రైతులు కోర్టును ఆశ్రయించగా వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. అయితే ఇవాళ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తుండటంతో రాజధాని జేఏసీ నిరసనలకు పిలుపునిచ్చింది. నల్ల బెలూన్లు, నల్ల జెండాలతో నిరసనలు తెలపనున్నారు రైతులు. మరోవైపు జనసేన కూడా ఇళ్ల నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ చలో కృష్ణాయపాలెంకు పిలుపునిచ్చింది. దీంతో పోలీసులు బందోబస్తు పెంచారు. రాజధాని గ్రామాల్లో పహారా నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తూ.. నిరసనకారులను అడ్డుకుంటున్నారు.
లే అవుట్లలో మౌలిక వసతుల కల్పనకు రూ.384.42 కోట్లు,
రూ.73.74 కోట్లతో 11 అంగన్‌వాడీ కేంద్రాలు
11 డిజిటల్ లైబ్రరీలు,12 ఆస్పత్రుల నిర్మాణం
శంకుస్థాపన అనంతరం వెంకటపాలెంలో భారీ బహిరంగ సభ