Bandaru Satyanarayana: మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్ట్

Bandaru Satyanarayana: 41ఏ, 41బీ నోటీసులు ఇచ్చి అరెస్ట్ చేసిన పోలీసులు

Update: 2023-10-03 02:08 GMT

Bandaru Satyanarayana: మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్ట్

Bandaru Satyanarayana: TDP సీనియర్‌ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తిని పోలీసులు అరెస్టు చేశారు. అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలోని తన నివాసంలో ఆయనకు 41ఏ, 41బీ నోటీసులు ఇచ్చి పోలీసులు అరెస్టు చేశారు. తొలుత అనకాపల్లి ఆస్పత్రిలో వైద్య పరీక్షలు చేశారు. ఆయనను మంగళగిరి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. మళ్లీ ప్లాన్ మార్చిన పోలీసులు.. అనకాపల్లి ప్రభుత్వాస్పత్రికి కాకుండా నేరుగా హైవే మీదుగా గుంటూరు జిల్లాకు తరలించారు.

బండారు ఇంటి వద్ద ఆదివారం అర్ధరాత్రి నుంచి హైడ్రామా కొనసాగింది. ఇటీవల రాష్ట్ర మంత్రి రోజాపై ఆయన అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ డీజీపీకి లేఖ రాశారు. ఈ అంశంపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు. సీఎం జగన్‌ను అసభ్యకర పదజాలంతో దూషించారంటూ గుంటూరు అరండల్ పేట పోలీస్ స్టేషన్‌లో ఏఎస్ఐ నాగరాజు ఫిర్యాదు చేశారు. దీంతో పలు సెక్షన్ల కింద సత్యనారాయణపై పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇటు గుంటూరు నగరంపాలెంలో సత్యనారాయణపై మరో కేసు నమోదైంది. మంత్రి రోజాను అసభ్యకరంగా దూషించారంటూ మంజుల ఫిర్యాదు చేసింది. దీంతో సత్యనారాయణపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఆ క్రమంలోనే పరవాడ డీఎస్పీ కె.వి.సత్యనారాయణ, సీఐ ఈశ్వరరావు ఆదివారం అర్ధరాత్రి సమయంలో భారీ పోలీసు బలగాలతో బండారు నివాసానికి చేరుకున్నారు. ప్రహరీ గేట్లు తీసుకుని లోపలికి ప్రవేశించారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నేతలు భారీగా బండారు ఇంటికి తరలివచ్చారు.

అర్ధరాత్రి తమ నాయకుడి ఇంటికి ఇంతమంది పోలీసులు రావాల్సిన అవసరమేంటని టీడీపీ శ్రేణులు మండిపడ్డాయి. దీంతో సోమవారం సాయంత్రం వరకు ఉద్రిక్తత కొనసాగింది. అయితే, బండారుకు 41ఏ, 41బీ నోటీసులు ఇచ్చేందుకు.. పలువురు పోలీసులు గేటు దూకి మరీ ఇంట్లోకి వెళ్లారు. దీంతో పోలీసుల తీరుపై టీడీపీ కార్యకర్తలు, మహిళలు ఆందోళనకు దిగారు. మరోవైపు బండారు తరఫు న్యాయవాదులు కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News