Siva Balakrishna: ఐదో రోజు ఏసీబీ కస్టడీకి HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ
Siva Balakrishna: బాలకృష్ణ విచారణలో బయటపడుతున్న సంచలన విషయాలు
Siva Balakrishna: అక్రమాస్తుల కేసులో అరెస్టయిన HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను కస్టడీలో భాగంగా ఐదో రోజు ప్రశ్నించనుంది ఏసీబీ. అక్రమాస్తులు కూడబెట్టిన శివబాలకృష్ణ విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. 4 రోజుల కస్టడీలో ఇప్పటికే శివబాలకృష్ణ నుంచి కీలక సమాచారం సేకరించారు ఏసీబీ అధికారులు. రియల్ ఎస్టేట్స్ వ్యాపారంలో పెట్టుబడులపై ఏసీబీ అధికారులు విచారించారు. బాలకృష్ణ సోదరుడు శివ సునీల్ కుమార్‌ను విచారించారు ఏసీబీ అధికారులు. సునీల్ సహా అతని భార్య పేరిట భారీగా ఆస్తులను గుర్తించారు. జనగామ, గజ్వేల్, కొడకండ్ల, మోత్కూర్, పాలకుర్తి, రిమ్మనగూడ, బీబీనగర్‌లో సునీల్ అతని భార్య పేరుతో ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు.
బాలకృష్ణ సోదరుడు సునీల్ బినామీగా ఉన్నట్లు ఐడెంటిఫై చేశారు. మరో వైపు రియల్ ఎస్టేట్ కంపెనీల్లోనూ సునీల్ పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు. ఎల్బీనగర్, బంజారాహిల్స్‌లో నిర్మాణంలో ఉన్న రేస్ టవర్స్ రియల్ ఎస్టేట్ కంపెనీలో పెట్టుబడినట్లు గుర్తించారు. బాలకృష్ణ లాకర్‌లో 20 లక్షల రూపాయల నగదు, బంగారు ఆభరణాలు సహా పలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. మరో వైపు బాలకృష్ణ సెల్‌ఫోన్‌లోని కాల్ డేటాపై ఫోకస్ పెట్టారు ఏసీబీ అధికారులు. కాల్ డేటా ఆధారంగా చేసుకుని విచారిస్తే మరిన్ని కీలక విషయాలు బయటపడే అవకాశం ఉందని ఏసీబీ భావిస్తోంది. అక్రమాస్తుల కూడబెట్టిన బాలకృష్ణ బినామీలకు ఏసీబీ నోటీసులు జారీ చేసింది.