టీడీపీతో బీజేపీ పొత్తు ఫిక్స్! చంద్రబాబు, అమిత్ షా భేటీపై రాజకీయ వర్గాల్లో చర్చ

AP Politics: ఇరు పార్టీల పొత్తు ఖాయమని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్తున్న టీడీపీ

Update: 2023-06-05 05:28 GMT

టీడీపీతో బీజేపీ పొత్తు ఫిక్స్! చంద్రబాబు, అమిత్ షా భేటీపై రాజకీయ వర్గాల్లో చర్చ

AP Politics: ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. 2024 ఎన్నికల దిశగా కీలక అడుగులు పడుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ -జనసేన పొత్తు ఖాయమైంది. బీజేపీ కూడా తమతో కలిసి వస్తుందని పవన్ కల్యాణ్ చెబుతూనే ఉన్నారు. ఇప్పటి వరకు టీడీపీతో కలిసేందుకు బీజేపీ నేతలు ససేమిరా అన్న బీజేపీ నేతలు స్వరం మార్చారు. కర్ణాటక ఎన్నికల తరువాత ఇప్పుడు బీజేపీ కొత్త నిర్ణయాల ప్రకటనకు సిద్దం అవుతోంది. పొత్తుల విషయంలో కొత్త అంశాలు తెర మీదకు వస్తున్నాయి.

ఏపీలో 2014 పొత్తుల ఫార్ములా మరోసారి అమలు చేయాలని టీడీపీ, జనసేన భావిస్తున్నాయి. ఈ మేరకు ఇప్పటికే జనసేనాని స్పష్టమైన ప్రకటన చేసారు. వచ్చే ఎన్నికల్లో పొత్తులు ఖాయమని ప్రకటించారు. టీడీపీ, బీజేపీ, జనసేన పొత్తు ఖాయమవుతుందని స్పష్టం చేసారు. ఇదే అంశం పైన బీజేపీ ముఖ్య నేతలతో పవన్ మంత్రాంగం నడిపారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా మూడు పార్టీలు కూటమిగా పోటీ చేయాలని ప్రతిపాదించారు. జీవీఎల్, సోము వీర్రాజు లాంటి ఏపీ బీజేపీ నేతలు.. పవన్ పొత్తు ప్రతిపాదనపై గతం కన్నా భిన్నంగా స్పందించారు.

కర్టాటక ఫలితాల తరువాత పొత్తులు బీజేపీకి అవసరమనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇదే సమయంలో బీజేపీతో పొత్తులు అవసరమా అనే చర్చ కూడా మొదలైంది. ఈ క్రమంలో టీడీపీ అధినేత చంద్రబాబు, అమిత్ షాతో భేటీ కావడం ప్రాదాన్యతను సంతరించుకుంది. ఢిల్లీలో చంద్రబాబు.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో బేటీ అయ్యారు. నాలుగేళ్ల తర్వాత మళ్లీ కీలకమైన రాజకీయ పరిణామం జరిగినట్లైంది. 2019 తర్వాత చంద్రబాబు.. అమిత్ షాని కలవడం ఇదే తొలిసారి. ఈ భేటీలో ఇరు పార్టీల పొత్తుతో పాటు సీట్ల కేటాయింపులపై కూడా చర్చ జరిగినట్టు ప్రచారం జరుగుతోంది.

ఈ భేటీతో ఏపీ రాజకీయాల్లో సంచలన మార్పులు వచ్చేస్తాయని కొందరు... ఆల్రెడీ అనుకున్నదేగా అని మరికొందరు అంటున్నారు. ఇలా ఇదో హాట్ టాపిక్ అయ్యింది.ఈమధ్య తెలంగాణలో టీడీపీతో బీజేపీ పొత్తు పెట్టుకోవాలని కొందరు ఆ పార్టీ తెలంగాణ నేతలు కోరుతున్నట్లు తెలిసింది. వాళ్లే... ఏపీలో కూడా టీడీపీతో, బీజేపీ పొత్తు పెట్టుకుంటే మంచిదేనని అంటున్నట్లు సమాచారం. దీనిపై చర్చించేందుకు అమిత్ షా ఆహ్వానం పలకడం వల్లే చంద్రబాబు ఈ భేటీలో పాల్గొన్నారనే ప్రచారం జరుగుతోంది.

నిజానికి 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమి తర్వాత నుంచి తిరిగి బీజేపీతో పొత్తు కోసం టీడీపీ ప్రయత్నిస్తూనే ఉన్నా... బీజేపీ ఆ దిశగా ముందుకు రాలేదు. అదే సమయంలో జనసేనతో పొత్తు పెట్టుకున్నా... వైసీపీపై పెద్దగా పోరాటం చెయ్యకుండా సైలెంటుగా ఉంటోంది. అందుకు తగ్గట్టుగానే... వైసీపీ ... బీజేపీకి బయటి నుంచి మద్దతు ఇస్తోంది. అందువల్ల ఏపీలో వైసీపీ వల్ల తమకు ఎలాంటి ఇబ్బందీ లేదు కదా అని బీజేపీ... టీడీపీవైపు చూడలేదు.

తాజాగా... టీడీపీతో పొత్తు దాదాపు ఖరారైనట్లు భావిస్తున్న జనసేన ... బీజేపీపై ఒత్తిడి పెంచుతోంది. అలాగే.. బీజేపీలోని స్థానిక నేతలు సైతం... పొత్తు వల్ల లాభమే తప్ప నష్టం ఉండదని హైకమాండ్‌కి చెబుతుండటం వల్లే... అమిత్ షా ఈ దిశగా ముందుకొచ్చారనే ప్రచారం జరుగుతోంది.

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేపీ ఓటమి పాలవడంతో.. తెలుగు రాష్ట్రాల్లో ఆ పార్టీ పరిస్థితి ఏంటనే ప్రశ్న తెరపైకి వచ్చింది. తెలంగాణలో ఒంటరిగా ఎన్నికలకు వెళ్తే.. బలం సరిపోదనే ఆలోచనలో ఉన్న స్థానిక కమలం నేతలు.. టీడీపీతో పొత్తు మంచిదే అని చెప్పినట్లు సమాచారం. ప్రస్తుతం తెలంగాణలో... బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా సీన్ కనిపిస్తోంది. అది మారిపోయి.. బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారాలని కాషాయదళం భావిస్తోంది. అలా జరగాలంటే.. టీడీపీ కూడా తమతో కలిసివస్తే మంచిదే అని స్థానిక నేతలు అనుకుంటున్నారని సమాచారం.

బీజేపీ హైకమాండ్ పెద్దలు మాత్రం.. తెలంగాణలో ఒంటరిగానే బరిలో దిగి... ఏపీలో మాత్రం టీడీపీతో పొత్తు పెట్టుకోవచ్చు అని అనుకుంటున్నట్లు సమాచారం. కాషాయదళం పొత్తుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే... ఇక ఏపీ రాజగకీయం.. వైసీపీ వర్సెస్ ప్రతిపక్ష కూటమిగా మారుతుంది. అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అన్న జనసేన అధినేత మాట నిజమవుతుంది. ఇదంతా ఓకే గానీ.. అసలు ఈ పొత్తులు కలిసొస్తాయా? ఏపీ ప్రజలు మళ్లీ ఈ కూటమిని స్వాగతిస్తారా? అనేవి తేలాల్సిన ప్రశ్నలు. వీటికి త్వరలోనే ఆన్సర్లు దొరికే ఛాన్స్ ఉంది.

Tags:    

Similar News