ఏపీలో ముగిసిన తొలివిడత ఎన్నికలు
* 2,723 సర్పంచ్, 20,157 వార్డులకు పోలింగ్ * ఏపీ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ దూకుడు * వైసీపీ బలపర్చిన అభ్యర్ధులు ఘనవిజయం
ఎన్నో వివాదాలు, మరెన్నో నాటకీయ పరిణామాల నేపథ్యంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. సవాళ్లు, ప్రతి సవాళ్లతో గత కొన్ని రోజులుగా రాష్ట్ర రాజకీయాలు హాట్ హాట్ గా మారాయి. కొన్ని చోట్లు మినహాయించి రాష్ట్ర వ్యాప్తంగా ఉదయం 6.30 గంటల నుంచే పోలింగ్ ప్రారంభమైంది. ప్రధాన పార్టీలన్నీ ఈ ఎన్నికలను ఛాలెంజింగ్‌గా తీసుకోవడంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అంతేకాకుండా కొన్ని ప్రాంతాల్లో ఇరు వర్గాలు పరస్పరం దాడులకు కూడా దిగారు. భారీ బందోబస్తుల నడుమ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. అనంతరం కౌంటింగ్ జరిగింది. చాలా చోట్ల అర్ధరాత్రి వరకు కౌంటింగ్ జరుగుతూనే ఉంది.
12 జిల్లాల్లో తొలిదశ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొత్తం 2 వేల 723 పంచాయతీలు, 20 వేల 157 వార్డులకు పోలింగ్ పూర్తయింది. చెదురు మదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా సాగింది.
తొలి దశ ఎన్నికలపై ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేశ్ సంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని జిల్లాల్లో కలిపి 81.78 శాతం పోలింగ్ నమోదైనట్లు ఆయన వెల్లడించారు. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 85.06 శాతం నమోదైందన్నారు. గతంతో పోలిస్తే ఈసారి ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయని చెప్పారు. ఎన్నికలు సజావుగా నిర్వహించిన అధికారులకు ఎస్‌ఈసీ అభినందనలు తెలిపారు.
చాలా చోట్ల కౌంటింగ్ కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల్లో వైసీపీ మద్దతుదారులు హవా చూపించారు. 1494 గ్రామ పంచాయతీలు వైసీపీ మద్దతు దారులు గెలుచుకున్నారు. వెయ్యి ఐదు మంది టీడీపీ మద్దతు దారులు గెలుచుకున్నారు. టీడీపీతో పొత్తుతో 9స్థానాలు, బీజేపీ 1 స్థానం, ఇతరులు 50 గ్రామ పంచాయతీల్లో విజయం సాధించారు.
అయితే, మెజారిటీ గ్రామాల్లో వైసీపీ బలపర్చిన అభ్యర్ధులు ముందంజలో ఉన్నారు. దాంతో, అత్యధిక స్థానాలను అధికార వైసీపీ కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. దాంతో, తొలి విడత ఎన్నికల్లో 90శాతం స్థానాలను కైవసం చేసుకుంటామని వైసీపీ ధీమా వ్యక్తంచేస్తోంది. ఇక, ఫస్ట్ ఫేజ్ పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలుచుకోవడంతో తాడేపల్లిలోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు. డప్పులు వాయిస్తూ బాణాసంచా కాలుస్తూ కార్యకర్తలు డ్యాన్స్‌లు చేశారు.