Tirupati: పార్లమెంటు నియోజకవర్గానికి తొలిసారి ఉప ఎన్నికలు
Tirupati: టీడపీ నుంచి బరిలోకి పనబాక లక్ష్మి * కాంగ్రెస్ అభ్యర్ధిగా చింతామోహన్ పోటీ
Tirupati: తిరుపతి ఉప ఎన్నిక కోసం కసరత్తు మొదలు పెట్టిన రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపిక విషయంలో పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా కొన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించగా ఇంకొందరు అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
తిరుపతి పార్లమెంటు నియోజకవర్గానికి తొలిసారిగా జరిగుతున్న ఉప ఎన్నికలో గెలుపు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఈ సారి పోటీలో ఉండబోతున్న వారిలో టీడీపీ, కాంగ్రెస్ నుంచి కేంద్ర మంత్రులుగా పని చేసిన వారు బరిలో నిలవబోతుండగా వైసీపీ, బీజేపీ నుంచి కొత్త వ్యక్తులు రంగంలోకి దిగుతున్నారు.
ఏడు దశాబ్దాల చరిత్ర కలిగిన తిరుపతి లోక్ సభ నియోజకవర్గం 17వ ఎన్నికకు సిద్దమవుతోంది. 1952లో జరిగిన తొలి ఎన్నికల్లో గెలిచిన అనంతశయనం అయ్యంగార్ లోక్ సభ స్పీకర్ గా కూడా పనిచేశారు.
అనంతరం నియోజకవర్గ కేంద్రంగా తిరుపతి పేరు లేదు. ఆ తర్వాత జరిగిన పునర్విభజనలో 1962 నుంచి ఇప్పటిదాకా ఈ నియోజకవర్గం ఎస్సీలకు రిజర్వు అవుతోంది. ఇప్పటివరకు తిరుపతి లోక్ సభ స్థానానికి 16 సార్లు ఎన్నికలు జరగగా 12 సార్లు కాంగ్రెస్ విజయం సాధించింది. 2 సార్లు వైఎస్సార్ కాంగ్రెస్ గెలుపొందింది. ఒక్కోసారి బీజేపీ, టీడీపీ అభ్యర్థులు గెలిచారు. 16 సార్లు జరిగిన ఎన్నికలలో తొలిసారి తెలుగుదేశం అభ్యర్థిగా, 8 సార్లు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఆరుసార్లు విజయం సాధించిన విశిష్ట చరిత్రను కేంద్ర మాజీ మంత్రి డాక్టర్ చింతామోహన్ సొంతం చేసుకున్నారు. తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి మూడుసార్లు మధ్యంతర ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 17న తొలి ఉప ఎన్నిక జరగనుంది.
వైసీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించిన బల్లి దుర్గా ప్రసాద్ గత యేడాది మరణించడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. టీడపీ నుంచి పనబాక లక్ష్మి, వైసీపీ నుంచి గురుమూర్తి పోటీలో నిలవబోతున్నారు. కాంగ్రెస్ నుంచి చింతామోహన్ అలాగే బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా దాదరి శ్రీనివాసులు బరిలో ఉండే అవకాశం ఉంది.