Fire accident in Nellore Chemical factory: నెల్లూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం
Fire accident in Nellore Chemical factory: నెల్లూరు జిల్లాలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు గాయపడ్డారు
Fire accident in Nellore Chemical factory: నెల్లూరు జిల్లాలోని ఓ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో నలుగురు కార్మికులు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకెళ్లే.. నెల్లూర్ జిల్లాలోని వింజమూరు మండలం చంద్రపడియలో గల వినయ్ ఆగ్రో కెమికల్ ఫ్యాక్టరీలో బుధవారం తెల్లవారుజామున ఈ ఘటన సంభవించింది. కంప్రెషర్ యూనిట్‌లో మంటలు చెలరేగినట్లు చెబుతున్నారు. ఆ సమయంలో అక్కడే విధుల్లో ఉన్న నలుగురు కార్మికులు గాయపడ్డారు. వెంటనే వారిని నెల్లూరులోని నారాయణ ఆసుపత్రికి తరలించారు. అగ్నికీలలు ఇతర యూనిట్లకు కూడా వ్యాపించాయి. ఫ్యాక్టరీలో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. దీంతో స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హూటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. భారీగానే ఆస్తినష్టం కూడా వాటిల్లిందని పోలీసులు అంచనా వేస్తున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.గాయపడిన కార్మికుల్లో ఒకరి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు చెబుతున్నారు. విశాఖపట్నంలో తరచూ అగ్నిప్రమాదాలు సంభవిస్తూ వచ్చాయి. ఆర్ ఆర్ వెంకటాపురంలో గల ఎల్జీ పాలిమర్స్ సహా పరవాడలో గల జవహర్‌లాల్ నెహ్రూ ఫార్మాసిటీలో రెండు కెమికల్ ఫ్యాక్టరీల్లో అగ్నిప్రమాదాలు సంభవించాయి. తాజాగా చోటు చేసుకున్న వింజమూరు ఘటనతో నెల్లూరు జిల్లా వాసులు ఉలిక్కిపడ్డారు. ఇదివరకు నెల్లూరు నగరంలో ఓ ట్రాన్స్‌ఫార్మర్ పేలడం వల్ల ఓ రసాయన కంపెనీలో అగ్నిప్రమాదం సంభవించిన విషయం తెలిసిందే.