71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలో అత్యున్నత పద్మ పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2020 సంవత్సరానికి గాను వివిధ రంగాల్లో చేసిన విశేష సేవలు చేసిన వారికి పద్మపురస్కారాలను ప్రకటించింది. ఈ ఏడాదికి గాను మొత్తం 21 మందిని పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది. ఇక ఇందులో మొత్తం ఐదు తెలుగు పద్మాలు వికసించాయి. క్రీడాల విభాగంలో తెలుగు తేజం పీవీ సింధూను పద్మభూషణ్ వరించింది. తెలంగాణ నుంచి వ్యవసాయం కేటగిరిలో చిన్నతల వెంకట్ రెడ్డికి విద్య, సాహిత్యం కేటగిరిలో విజయసార్థి శ్రీభాష్యంకు పద్మశ్రీలు దక్కాయి. ఏపీ నుంచి కళలు కేటగిరిలో యడ్ల గోపాలరావుకి.. దలవాయి చలపతిరావు పద్మశ్రీ లభించాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎన్నికైన యడ్ల గోపాలరావు, దలవాయి చలపతిరావు ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..
యడ్ల గోపాలరావు :
శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం మందరాడ గ్రామానికి చెందిన వాడు యడ్ల గోపాలరావు.. 12 వ ఏటే తన నాటక జీవితాన్ని ప్రారంభించారు. యడ్ల సత్యం నాయుడు ప్రోత్సాహంతో అయన కళారంగంలో అడుగు పెట్టారు. ఇక సత్యహరిశ్చంద్ర నాటకంలో ఆయన వేసిన నక్షత్రక పాత్రకు మంచి పేరును తీసుకువచ్చింది. గత 55 ఏళ్లుగా అయన నాటక రంగానికి సేవలు అందిస్తున్నారు. దేశవిదేశాలలో నాటకాలను వేశారు. ఇక రవీంద్రభారతిలో కూడా పలు నాటకాలు వేసి అక్కినేని నాగేశ్వరరావు, తనికెళ్ళ భరణి చేతుల మీదిగా సత్కారాలు అందుకున్నారు.
దలవాయి చలపతిరావు :
దలవాయిచలపతిరావు తోలుబొమ్మలాట కళాకారుడు. అనంతపురం జిల్లా ధర్మవరం మండలం నిమ్మలకుంటకు చెందినవాడు. 10 ఏళ్ల వయసులో తోలుబొమ్మలాటను ప్రారంభించిన అయన గత ఆరు దశాబ్దాలుగా ఆ రంగంలో ప్రసిద్ది చెందారు. 1988లో జాతీయ అవార్డు అందుకున్న ఆయన.. 2016లో కళారత్న పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రస్తుతం అయన యువతకు తోలుబొమ్మలాట రంగంలో శిక్షణనిస్తున్నారు.
ఈ అవార్డులు సాధించిన వీరికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. వీరి భవిష్యత్‌లో మరింతగా రాణించాలని అయన ఆకాంక్షించారు.