Financial Aid For Anganwadis in AP: ఇక అంగన్వాడీల వంతు.. నాడు-నేడుతో పాటు వారికి రూ. 5వేలు సాయం
Financial Aid For Anganwadis in AP: ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలలను మెరుగైన రీతిలో తీర్చిదిద్దేందుకు నాడు- నేడు కార్యక్రమం ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం.
Financial Aid For Anganwadis in AP: ఇప్పటివరకు ప్రభుత్వ పాఠశాలలను మెరుగైన రీతిలో తీర్చిదిద్దేందుకు నాడు- నేడు కార్యక్రమం ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం తాజాగా దీనిని అంగన్వాడీలకు విస్తరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు వీటిలో ప్రధాన లబ్ధిదారులైన చిన్నారులతో పాటు గర్భవతులకు ప్రత్యేక పోషణకరమైన ఆహారాన్ని అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో పాటు తాజాగా ప్రసవం అయిన తల్లులకు ప్రత్యేకంగా వైఎస్సార్ అసరా పథకం ద్వారా రూ. 5వేలు సాయం అందించాలని ఆదేశించారు.
భవిష్యత్తులో అంగన్‌వాడీ కార్యకలాపాలను మరింత పటిష్టం చేయాలని సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీల్లో నాడు-నేడు, వైఎస్‌ఆర్ సంపూర్ణ పోషణపై సమీక్షా సమావేశం నిర్వహించిన సీఎం..ప్రసవం అయిన మహిళలకు ఆరోగ్య ఆసరా కింద ఐదువేల రూపాయలు అందించాలని సీఎం జగన్ ఈ కార్యక్రమంలో పేర్కొన్నారు. అంతేకాకుండా వైఎస్సార్ సంపూర్ణ పోషణ అమలు తీరుపై క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీలను సమర్థవంతంగా నిర్వహిస్తున్న వారిని ప్రోత్సహించాలని పేర్కొన్నారు.
గర్భవతులు, బాలింతలు సహా 36 నెలలోపున్న శిశువులను ఒక విధంగా, 36 నుంచి 72నెలల వరకున్న చిన్నారులను మరో విధంగా చూడాల్సి ఉంటుందని సీఎం అభిప్రాయపడ్డారు. అంగన్‌వాడీలోని పిల్లలకు లెర్నింగ్ స్కిల్స్ కోసం టూల్స్, టీవీ, సహా ప్రత్యేక పుస్తకాలను అందించాలని పేర్కొన్నారు. అంతేకాకుండా అంగన్‌వాడీల్లో ఆహారం ఎక్కడ తిన్నా ఒకే నాణ్యత ఉండాలన్నారు. ప్రీ ప్రైమరీ-1, ప్రీ ప్రైమరీ-2లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని , దీనిపై సమగ్రంగా ఆలోచించి ప్రణాళికలు రూపొందించాల్సిందిగా సీఎం ఆదేశించారు. సిలబస్‌పైనా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.