సచివాలయ సిబ్బంది లీలలు.. సెంటు భూమి లేకున్నా 1031 ఎకరాలు ఉన్నట్లు రికార్డులు
విశాఖలో సచివాలయం సిబ్బంది లీలలు ఒక పేద కుటుంబానికి శాపంగా మారింది. తినడానికి తిండి లేని పేదోడి కుటుంబం పేరిట వెయ్యి ఎకరాలు భూమి వున్నట్టు రికార్డులు చూపిస్తున్నారు. దాంతో ప్రభుత్వ పథకాలకు అనర్హులుగా ప్రకటించటంతో గత్యంతరం లేక హెచ్ఎంటీవీ ని ఆశ్రయించారు.
విశాఖ జిల్లా అగనంపూడి గ్రామానికి చెందిన జెర్రిపోతుల లక్ష్మి భర్త పదేళ్లు క్రితం అనారోగ్యంతో మరణించటంతో మిషన్ కుట్టుకుంటు కుటుంబ పోషణ చేసుకుంటుంది. కుమార్తెకు అమ్మఒడి కోసం దరఖాస్తు చేయగా పదవ తరగతి చదివే తన కుమారుడుకి అదే గ్రామంలో 1031 ఎకరాలు భూమి వున్నందున ఏ ప్రభుత్వ పథకాలు వర్తించవని సచివాలయం సిబ్బంది బాంబు పేల్చారు. తమకు సెంటు భూమి లేదని, పూట గడవటమే కష్టంగా వుందని వేడుకున్నా సిబ్బంది కానీ, రెవిన్యూ అధికారులు గానీ పట్టించుకున్న పాపాన పోలేదు.
రెవిన్యూ అధికారుల వల్ల జరిగిన పొరపాటుకు తమ కుటుంబం బలైపోతుందని లక్ష్మి హెచ్ఎంటీవీ వద్ద వాపోయింది. సచివాలయం నుంచి కలెక్టరేట్ వరుకు కాళ్లరిగేటట్టు తిరిగినా తమ సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారి ప్రామెయం లేకుండానే జరిగిన తప్పిదాలకు ఇప్పటికే లక్ష్మీ కుమార్తె ఇంటర్ లో స్కాలర్షిప్ ను పోగొట్టుకుంది. తాను బీటెక్ చేస్తే ఫీజ్ రీ ఎంబర్స్ మెంట్ కూడా దక్కదని తన ఆవేదనను వ్యక్తం చేసింది రమ్య.
రెవెన్యూ సిబ్బంది అలసత్వం వల్ల తాము సమస్యలెదుర్కొంటున్నామని, పోనీ తన పేరు మీదున్న 1031 ఎకరాల భూమి ఎక్కడుందో చూపించాలని లక్ష్మీ కుమారుడు డిమాండ్ చేస్తున్నాడు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమ కుమారుడి పేరిట పొరపాటున నమోదైన వెయ్యి 31 ఎకరాలు భూమిని రికార్డుల నుంచి తొలగించి తమకు ప్రభుత్వ పథకాలు అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని లక్ష్మీ కుటుంబం వేడుకుంటుంది.