Visakhapatnam: విశాఖ జిల్లాలో జోరుగా రంగురాళ్ల తవ్వకాలు
Visakhapatnam: రంగు రాళ్ల కోసం విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ తవ్వకాలు.
Colorful Stones in Visakhapatnam: విశాఖ జిల్లాలో రంగు రాళ్ల తవ్వకాలు మళ్లీ జోరుగా సాగుతున్నాయి. నర్శీపట్నం నియోజకవర్గంలోని పప్పు శెట్టిపాలెంలోని రంగురాళ్లు కోసం గుట్టు చప్పుడు కాకుండా తవ్వకాలు చేస్తున్నారు.ఈ విషయం కాస్తా ఆ నోటా..ఈనోటా బయటపడి చివరకు పోలీసుల వరకు వెళ్లింది. వెంటనే అలెర్ట్ అయిన పోలీసులు..ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అయినా రంగు రాళ్ల తవ్వకాలకు మాత్రం ఫుల్ స్టాప్ పడడంలేదు. నిత్యం ఎక్కడో ఓ చోట రంగు రాళ్ల కోసం తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి.
తాజాగా విశాఖలో రంగురాళ్ల తవ్వకాలు మరోసారి కలకలం రేపాయి. గొలుసుగొండ మండలం పప్పు శెట్టిపాలెం గ్రామ సమీపంలో రంగురాళ్ళ కోసం తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. అయితే ఒకరిని చూసి మరొకరు ఆ ప్రాంతంలో తవ్వకాలు జరుపుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లడంతో పోలీసుల రాకను గమనించిన తవ్వకం దారులు అక్కడి నుంచి పరారయ్యారు. తవ్విన గుంతలను పోలీసులు పూడ్చేవారు. మళ్లీ తవ్వకాలు జరగకుండా పోలీస్ సిబ్బందిని కాపలా పెట్టారు. అంతేకాదు..144 సెక్షన్ ను విధించారు. గతంలోనే రంగురాళ్ల కోసం తవ్వకాలు జరపగా కొంతమంది కూలీలు మరణించినట్లు తెలుస్తోంది.
విశాఖ జిల్లాలో యధేచ్చగా జరుగుతున్న రంగురాళ్ల తవ్వకాలపై అధికారులు దృష్టిసారించాలని జిల్లా వాసులు కోరుతున్నారు. ముఖ్యంగా మన్యంలో రంగురాళ్ల తవ్వకాల కోసం భారీమొత్తంలో నగదు చేతులు మారుతుందని సమాచారం. అధికారులు స్పందించి ఇలాంటి వాటికి చెక్ పెట్టాలని కోరుతున్నారు.