ఏం చేసినా ఊరుకోవడానికి అక్కడుంది ఆయన కాదు..జగన్ సర్కార్ పై ఉండవల్లి ఘాటు వ్యాఖ్యలు
కరోనా వ్యాప్తి నివారణలో జగన్ సర్కార్ ఘోరంగా విఫలమైందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు. అధికారంలోకి వచ్చింది ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలు తీర్చుకోవడానికి కాదని ఆయన సూచించారు.
కరోనా వ్యాప్తి నివారణలో జగన్ సర్కార్ ఘోరంగా విఫలమైందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విమర్శించారు. అధికారంలోకి వచ్చింది ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలు తీర్చుకోవడానికి కాదని ఆయన సూచించారు. మాజీ ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేశ్‌పై సీఎం జగన్ ఎందుకు అభద్రతాభావంతో ఉన్నారని ప్రశ్నించారు. సీఎం నేరుగా ప్రెస్‌మీట్ పెట్టి నిమ్మగడ్డ రమేశ్ పై మాట్లాడటం ఘోరమైన చర్య అని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. ఏం చేసినా ఊరుకోవడానికి అక్కడుంది ఎల్వీ సుబ్రహ్మణ్యం కాదుని, అక్కడుంది నిమ్మగడ్డ రమేశ్, ఏబీ వెంకటేశ్వరరావు అని ఉండవల్లి అన్నారు. పాలకులకు కనిపించాల్సింది ప్రజలు కానీ ప్రత్యర్థులు కాదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హితవపలికారు.
ప్రభుత్వం ప్రజలకు 80,500 కోట్ల రూపాయలు పంచుతామని అంటోంది.. అంత డబ్బును ఎక్కడి నుంచి తెస్తారని ఉండవల్లి ప్రశ్నించారు. ప్రభుత్వానికి ఇసుక విధానంపై ముందుచూపు లేదని, రాష్ట్రంలో నిర్మాణ రంగం కుదేలైపోయిందని ఆయన అన్నారు. పేదలకు15 ఏళ్ల క్రితం కట్టించిన ఇళ్లే ఇంత వరకు ఇవ్వలేదని ఆరోపించారు.కరోనా నేపథ్యంలో కొంతమంది నియమనిబంధనలు పాటించడంలేదని విమర్శించారు. మాస్కులు ధరించి, సామాజిక దూరం కూడా పాటించడంలేదన్నారు. ప్రజల్లో ఎక్కువగా తిరిగే వాలంటీర్లు, ఆశావర్కర్లు, మీడియా ప్రతినిధులు అందరూ ఈ జాగ్రత్తలు పాటించాలని ఉండవల్లి సూచించారు. మాస్కు వేసుకోకపోతే ఫైన్ వేస్తున్న అధికారులే ఎందుకు మాస్కులు ధరించడంలేదని ఉండవల్లి ప్రశ్నించారు.