Nara Lokesh: ఈనెల 13 నుంచి నెల్లూరులోకి లోకేష్ యువగళం ఎంట్రీ

Nara Lokesh: లోకేష్‌కు గ్రాండ్‌ వెల్‌కమ్‌ పలికేందుకు టీడీపీ ఏర్పాట్లు

Update: 2023-06-11 04:19 GMT

Nara Lokesh: ఈనెల 13 నుంచి నెల్లూరులోకి లోకేష్ యువగళం ఎంట్రీ

Lokesh Yuvagalam: నారా లోకేష్ యువగళం పాదయాత్ర త్వరలోనే నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గంలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. లోకేష్ పాదయాత్రకు ఘనస్వాగతం పలికేందుకు టీడీపీ నాయకులు పెద్దఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలతో టీడీపీ నేతల మంతనాలు ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపాయి. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, బీద రవిచంద్రలు నెల్లూరులోని వైసీపీ రెబల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన సోదరుడు గిరిధర్ రెడ్డిలతో భేటీ అయ్యారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి నివాసంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి బ్రదర్స్ తో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. లోకేష్ పాదయాత్రలో భాగస్వామి కావాలంటూ ఆహ్వానించారు.

అనంతరం టీడీపీ నాయకులు నగరంలోని వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి నివాసానికి చేరుకొని ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. జిల్లాలో మొదటగా ఆత్మకూరు నియోజకవర్గం నుంచి యువనేత లోకేష్ యువగళం పాదయాత్ర జరుగుతున్న నేపథ్యంలో అందులో ప్రధాన భాగస్వామ్య కావాలంటూ అమర్నాథరెడ్డి, బీద రవిచంద్రలు ఎమ్మెల్యే ఆనంను కోరారు.

నెల్లూరు జిల్లాలో లోకేష్ యువగళం పాదయాత్ర సందర్భంగా పార్టీలో తమ బలాబలాలను చాటుకునేందుకు ఎక్కడికక్కడ నాయకులు సమాయత్తమవుతున్నారు. ఇదే సమయంలో జిల్లాలో తమ సత్తాను చాటాలని టీడీపీ భావిస్తోంది. తాజాగా మాజీ మంత్రి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి.. చంద్రబాబుని కలిశారు. లోకేష్ యువగళం పాదయాత్ర బద్వేల్ నియోజకవర్గం నుంచి ఆత్మకూరులో ప్రవేశించునున్న నేపథ్యంలో చంద్రబాబుతో ఆనం భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. అధికార వైసీపీ నుంచి తిరుగుబావుట ఎగరవేసిన ఆనం రామనారాయణరెడ్డి కొన్ని రోజులుగా ఆత్మకూరు నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించారు. లోకేష్ పాదయాత్ర సందర్భంగా తమ బలాన్ని, బలగాన్ని చూపేందుకు ఆనం సన్నద్ధమవుతున్నారు. ఇందుకోసం ఇప్పటికే ఆయన నియోజకవర్గంలో పాత, కొత్త తరం నాయకులతో సమావేశాలు నిర్వహించారు.

ఎమ్మెల్యే ఆనం గతంలో ఆత్మకూరు నియోజకవర్గం నుంచి రెండుసార్లు ప్రాతినిధ్య వహించారు. ఉమ్మడి రాష్ట్ర ఆర్థిక మంత్రిగా పనిచేశారు. అనేకమంది నాయకులతో పూర్తిస్థాయి అనుబంధాన్ని ఏర్పాటు చేసుకున్నారు. వైసీపీతో విడిపోయి బయటకు వచ్చిన ఎమ్మెల్యే ఆనం... లోకేష్ పాదయాత్ర ద్వారా తమ బలమేంటో.. పార్టీ అధినేతలకు ప్రత్యక్షంగా నిరూపించుకునేందుకు సిద్ధమవుతున్నారు.

నెల్లూరు జిల్లాలో ఇప్పటికే ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు తిరుగుబావుట ఎగరవేశారు. మరొకరు అసంతృప్తితో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో అసంతృప్తి వాదులను దగ్గర చేసుకుని లోకేష్ పాదయాత్ర పూర్తిస్థాయిలో విజయవంతం చేయాలని భావిస్తుంది తెలుగుదేశం పార్టీ. ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ అధిష్టానికి వ్యతిరేకంగా ఓటు వేశారన్న కారణంతో ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి లను వైసీపీ సస్పెండ్ చేసింది. ప్రస్తుతం ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు లోకేష్ పాదయాత్రలో కీలక పాత్ర పోషించబోతున్నట్లు టిడిపి వర్గాలు చెబుతున్నాయి. వీరితో పాటు మిగిలిన కేడర్ అందరినీ కలుపుకొని ఆరంభం అదుర్స్ అన్నంతగా లోకేష్ పాదయాత్రకు స్వాగతం పలకాలని టీడీపీ శ్రేణులు భావిస్తున్నారు.

Tags:    

Similar News