ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల అంశం మరోసారి కాక రేపుతోంది. ఎస్ఈసీ, రాష్ట్ర ప్రభుత్వం మధ్య అభిప్రాయ భేదాలను సృష్టిస్తోంది. కరోనా కారణంగా వాయిదా పడ్డ ఎన్నికలను మళ్లీ నిర్వహించేందుకు సాధ్యాసాధ్యాలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానం పంపగా ప్రభుత్వాన్ని సంప్రదించకుండా మీటింగ్‌లు ఏంటంటోంది అధికార పార్టీ.
ఏపీలో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఎన్నికల నిర్వహణకు దూకుడు పెంచారు. ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై చర్చించేందుకు ఇవాళ అఖిలపక్ష సమావేశానికి పార్టీలను ఆహ్వానించారు. గతంలో స్థానిక ఎన్నికల విషయంలోనే రాష్ట్ర ప్రభుత్వం, ఎస్‌ఈసీ మధ్య ఓ రేంజ్ వార్ జరగగా అఖిలపక్ష సమావేశం మరోసారి హీట్ రేపుతోంది.
ఇవాళ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో అఖిల పక్ష సమావేశం జరగనుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలను ఆహ్వానిస్తూ ప్రతినిధులను పంపాల్సిందిగా కమిషన్ లేఖలు పంపింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాజకీయ పార్టీల అభిప్రాయాలను, సూచనలను కమిషన్ తీసుకోనుంది. ఈ సమావేశానికి అధికార పార్టీ వైసీపీ హాజరు కాబోమని ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలీ, సీపీఐ ఏపీ కార్యదర్శి కె రామకృష్ణ, బీజేపీ నుంచి పాక సత్యనారాయణ సమావేశానికి హాజరు కానున్నారు.
ఇక ఆ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు మరోసారి ఎస్‌ఈసీ తీరును తప్పుబట్టారు. సుప్రీంకోర్టు తీర్పు ఏం చెప్పిందో తెలుసుకుని సమావేశం నిర్వహిస్తే బాగుండేదన్నారు. ఒకసారి ఆగిన ఎన్నికల ప్రక్రియను మరోసారి నిర్వహించాలంటే ప్రభుత్వ అభిప్రాయం తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తుచేశారు. తమను సంప్రదించకుండా సమావేశం నిర్వహించటం వెనుక వేరే ఉద్దేశాలున్నట్లు స్పష్టమవుతోందన్నారు.
మరోవైపు ఎస్‌ఈసీ నిర్ణయంపై హైకోర్టును ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం. ఆల్ పార్టీ మీటింగ్‌ను ఆపేయాలని హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. సుప్రీం ఆదేశాలకు విరుద్ధంగా ఎస్‌ఈసీ వ్యవహరిస్తున్నారని పిటిషన్‌లో పేర్కొంది. దీంతో ఇవాళ్టి సమావేశంపై ఉత్కంఠ నెలకొంది.