అకాల వర్షాలు వరదలు తూర్పుగోదావరి జిల్లాను అతలాకుతలం చేసాయి. కోనసీమ మొదలు మెట్ట వరకు వేలాది ఎకరాల్లో పంటనష్టం సామాన్యులకు శాపంగా మారింది. వేలాది ఎకరాల్లో వేసిన కాయగూరలు ఉల్లిపంటలు నీట మునగడంతో బహిరంగ మార్కెట్లో వాటి ధరలకు రెక్కలొచ్చాయి నిన్న మొన్నటి వరకు అందుబాటులో ఉన్న ధరలు అమాంతం పెరిగాయి.
తూర్పుగోదావరి జిల్లాలో కాయగూరలు ఉల్లి ధరలు ఒక్కసారిగా పెరిగాయి సామాన్యులకు అందనంత ఎత్తులోకి ఎగబాకాయి నిన్న మొన్నటి వరకు అందుబాటు లో ఉన్న ధరలు అమాంతం పెరగడంతో పేద మధ్య తరగతి ప్రజలు విలవిల్లాడుతున్నారు. రైతు బాజార్లలో కాస్తంత తక్కువగా ఉన్నప్పటికి అవి పరిమితంగా లభిస్తుండడంతో బహిరంగ మార్కెట్ లో కొనుగోలు చేయడం అనివార్యమవుతోంది. గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్నా పరిమితంగా దొరకడంతో ప్రజలు తప్పక బయట కొనుగోలు చేయాల్సి వస్తోంది. దీంతో బహిరంగ మార్కెట్లో వ్యాపారులు ఇష్టానుసారంగా రేట్లు పెంచి విక్రయాలు చేస్తున్నారు. ఉల్లి ఎగుమతులు తగ్గిపోవడంతో ప్రస్తుతం రైతు బాజార్లలో 30 రూపాయిల వరకు ఉల్లి విక్రయాలు జరుగుతున్నాయి అయితే బహిరంగ మార్కెట్ లో మాత్రం కిలో ఉల్లిపాయలు 70 నుంచి 80 రూపాయిల వరకు అమ్ముతున్నారు.
ఇక ప్రజలు నిత్యం వినియోగించే బీరకాయ, బెండకాయ, వంకాయ, దొండకాయ, మునగ వంటి కాయగూరలు ధరలకు రెక్కలొచ్చాయి. బహిరంగ మార్కెట్లో వీటి ధరలు 60 రూపాయిల పై మాటగానే ఉంటోంది. చిక్కుడు కాయ కాకరకాయ వంటి కూరగాయలు అయితే కిలో 80కి కూడా విక్రయిస్తున్నారు. కిలో టమాటా 60 రూపాయిల నుంచి 80 వరకు పలుకుతోంది. ఆకు కూరలు సైతం ఇదే తరహాలో విపరీతంగా రేట్లు పెరిగాయి ప్రజల అవసరాలకు అనుగుణంగా కాయగూరలు ఉల్లిపాయలు లభించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కోవిడ్ విస్తృతంగా ప్రభలుతోన్న తరుణంలో ఇలా రేట్లు పెరగడం వల్ల సామాన్యులకు మరింత ఇబ్బంది తప్పదని వాపోతున్నారు.
అయితే ఇటీవల తూర్పుగోదావరి జిల్లాను ఒకపక్క గోదావరి వరదలు వణికించగా ప్రస్తుతం విస్తారంగా కురుస్తున్న వర్షాలకు కారగూరలు పంటలు పూర్తిగా కుళ్లిపోయాయని రైతులు వాపోతున్నారు. కోనసీమ వ్యాప్తంగా ఇటీవల సంభవించిన గోదావరి వరదల కారణంగా లంక గ్రామాల పరధిలో సాగు చేసే కాయగూరల పంటలు పూర్తిగా నాశనమయ్యాయి. మరోవైపు గోదావరి వరద భయం ఇంకా పొంచి ఉండడంతో ఇంకా రెండు నెలల వరకు కాయగూరల సాగు కొనసీమలో సాధ్యం కాదని రైతులు అంటున్నారు. దీంతో జిల్లాలో అత్యధికంగా మార్కెట్లకు వెళ్లే కొనసీయ కాయగూరలు అందుబాటులో లేకుండా పోయాయి.
ఇదిలా ఉంటే ఈ ఏడాది మెట్ట ప్రాంతంలో మునుపెన్నడూ లేనంత వర్షాలు కురవడంతో గత కొద్ది రోజులుగా ఏలేరు జలాశయం పూర్తి స్ధాయి నీటి మట్టంతో నిండుకుండను తలపిస్తోంది. దీంతో మెట్ట ప్రాంతంలో ఏలేరు ప్రాజెక్టు నుంచి దిగువకు ఇరిగేషన్ అధికారులు వరద నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ప్రత్తిపాడు జగ్గంపేట పెద్దాపురం పిఠాపురం గొల్లప్రోలు మండలాల్లో వేలాది ఎకరాల్లో కాయగూరలు పంటలు నాశనం అయ్యాయి. గత 13 రోజులుగా కాయగూరల పంటలు నీటిలో మునిగిపోవడంతో అక్కడి నుంచి కాయగూరల ఎగుమతి పూర్తిగా నిలిచిపోయింది. జిల్లాలో అత్యధికంగా ఉల్లిసాగు చేసే గొల్లప్రోలు, పిఠాపురంలో ఉల్లిపంట కూడా పూర్తిగా నీట మునిగింది దీంతో రైతులు పూర్తిగా నష్టాల పాలయ్యారు. మహారాష్ట్ర నుంచి దిగుమతి అయ్యే ఉల్లితో పాటు జిల్లాలో సాగు చేసే ఉల్లిపాయలు అందుబాటులో ఉంటే తప్ప ధరలు ఇప్పట్లో అదుపులోకి వచ్చే సూచనలు కనిపించడం లేదు.
అయితే రైతు బజార్లలో ప్రజలకు కాయగూరలు, ఉల్లిపాయలు అందుబాటు ధరల్లో విక్రయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అంటున్నారు అధికారులు. ప్రస్తుతం రైతు బజార్లలో కూడా కాయగూరలు కిలో 40 రూపాయిలకు విక్రయించాల్సి వస్తోందని వర్షాలు వరదల కారణంగా పంటలకు పూర్తిగా నష్టం వాటిల్లడంతో దిగుబడి పూర్తిగా పడిపోయిందంటున్నారు. అయితే కోనసీమ, మెట్ట ప్రాంతాల్లో కాయగూరల సాగుకు ఇప్పట్లో పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో మరికొన్ని రోజులు ప్రజలకు ధరాఘాతం తప్పేటట్టు లేదు.