Vijayawada: సరస్వతి దేవి అలంకారంలో దర్శనమిస్తున్న అమ్మవారు
Vijayawada: మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి శక్తి రూపాలలో దర్శనం
Vijayawada: విజయవాడ ఇంద్రకీలాద్రిపై దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి. సరస్వతి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. మహాకాళి, మహాలక్ష్మి, మహా సరస్వతి శక్తి రూపాలలో అమ్మవారిని దర్శించుకొని భక్తులు పరవశించిపోతున్నారు. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలానక్షత్రం కావడంతో దుర్గమ్మను దర్శించుకోవడానికి భక్తులు పోటెత్తుతున్నారు. కిలోమీటర్ల మేర క్యూలైన్లలో బారులు తీరారు. మరోవైపు భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని క్యూలైన్లలో ఉచిత దర్శనాలు అందుబాటులోకి తీసుకొచ్చారు ఆలయ అధికారులు. వీఐపీ, వృద్ధులు, వికలాంగులకు ప్రత్యేక దర్శనాలు రద్దు చేశారు.
ఇంద్రకీలాద్రిపై శోభాయమానంగా జరుగుతున్న దసరా మహోత్సవాల్లో ఇవాళ ఎంతో విశిష్టమైన రోజు. దేవి శరన్నవరాత్రులలో మూలానక్షత్రంకు ఎంతో ప్రాచుర్యత ఉంది. అమ్మవారి జన్మించిన మూలా నక్షత్రం కావడంతో.. సరస్వతి దేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు అమ్మవారు. సరస్వతి దేవిగా బంగారు వీణ ధరించిన అమ్మవారిని దర్శించుకొని భక్తులు పరవశించిపోతున్నారు. విద్యార్దినీ విద్యార్దులకు చదువుల తల్లి సరస్వతీ అంటే అమితమైన ఇష్టం. అనుగ్రహం కోరినవారికి నిర్మలమైన దరహాసంతో సద్విద్యను శ్రీ సరస్వతి దేవి ప్రసాదిస్తుంది. మూలా నక్షత్రం నుంచి విజయదశమి వరకు పుణ్యదినాలుగా భావించి దుర్గాదేవిని ఆరాధిస్తారు. భక్తుల అజ్ఞానాన్ని ప్రారద్రోలి, జ్ఞానజ్యోతిని వెలిగించే జ్ఞాన ప్రదాయిని సరస్వతీదేవి.
మూలానక్షత్రం కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు. అర్ధరాత్రి నుంచే అమ్మవారి దర్శనానికి పోటెత్తారు. దీంతో ఇంద్రకీలాద్రి అమ్మవారి నామస్మరణతో మార్మోగుతోంది. దీనికితోడు ఇవాళ ఆదివారం కావడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. రాత్రి 11 గంటల వరకు అమ్మవారు సరస్వతి రూపంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇక.. రాష్ట్ర ప్రభుత్వం తరుపున సీఎం జగన్... ఇవాళ మధ్యాహ్నం అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. మరోవైపు.. మూలా నక్షత్రం సందర్భంగా.. భక్తులు భారీ తరలిరానున్న నేపథ్యంలో.. భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. అన్ని క్యూలైన్లను ఉచితం చేసినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు.