డ్రగ్స్ తో వైజాగ్ ఊగిపోతోంది
వైజాగ్ ఊగిపోతుంది. కాలేజీలు అడ్డాలు, కార్పొరేటు స్కూల్స్ దందాలు.. ఎల్ ఎస్ డీ లాంటి వైరల్ డ్రగ్స్ సైలెంట్ గా చేతులు మారుతున్నాయి.
వైజాగ్ ఊగిపోతుంది. కాలేజీలు అడ్డాలు, కార్పొరేటు స్కూల్స్ దందాలు.. ఎల్ ఎస్ డీ లాంటి వైరల్ డ్రగ్స్ సైలెంట్ గా చేతులు మారుతున్నాయి. మహా విశాఖ నగరంలో గుప్పెడు ఇసుక, నాలుగు ఉల్లిపాయలు దొరకడం కష్టంగా ఉంది గానీ, డ్రగ్స్ మాత్రం ఎంత కావాలంటే అంత విస్తారంగా లభ్యమవుతున్నాయి. స్మార్ట్ సీటీలో డ్రగ్స్ మాఫీయాపై హెచ్ ఎం టీవి స్పెషల్ ఫోకస్.
కొకైన్, ఎల్ ఎస్ డి పేరు ఏదైనా కావచ్చు ఈ డ్రగ్స్ మనిషిని బానిస చేసుకోవటంలో అన్నీ ఒక్కటే. ఒకప్పుడు మెట్రో నగరాలకే పరిమితం అయిన డ్రగ్స్ కల్చర్ ఇప్పుడు విశాఖకు పాకుతోంది. దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న వైజాగ్ లో యువత మత్తుకు చిత్తవుతున్నారు.
పబ్ కల్చర్ లో యూత్ డ్రగ్స్ మత్తులో పడి జీవితాన్ని కోల్పోతున్నారు. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చిన కొందరు మన దేశంలోని హైఫై సొసైటీకి డ్రగ్స్ రుచి చూపిస్తున్నారు. ఈజీ మనీ కోసం కొందరు ఇంటర్నెట్ ద్వారా కొనుగోలు చేసి ఈ గలీజ్ దందా చేస్తున్నారు.
ఆన్‌లైన్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న ఐదుగురు విద్యార్థుల ముఠాను విశాఖలో పోలీసులు అరెస్టు చేశారు. అరవింద్ అనే యువకుడు తన స్నేహితుడి ద్వారా ఎల్‌ఏడీ బ్లాట్‌ని 400 రూపాయలకు కొనుగోలు చేసి మరో నలుగురు స్నేహితులకు వెయ్యి రూపాయలకు విక్రయిస్తున్నాడు. ఆ స్నేహితులు ఎల్‌ఏడీ–బ్లాట్‌ని రెండు వేల చొప్పున కాలేజీ విద్యార్థులకు అమ్ముతున్నారు. పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేసి 33కు పైగా ఎల్.ఎస్.డీ. బ్లాట్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్ట్ చేశారు.
విశాఖలో డ్రగ్స్ కల్చర్ పెరుగుతుండడంపై నగర ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పిల్లలు ఏం చేస్తున్నారు అనే దానిపై తల్లిదండ్రులు దృష్టి పెట్టాలని కోరుతున్నారు. లేకపోతే సమాజానికి భారంగా మారుతారని హెచ్చరిస్తు్న్నారు.
విద్యార్థులు పెడదోవ పట్టకుండా విశాఖ పోలీసులు తమ వంతు కృషి చేస్తున్నారు. మత్తు వద్దు ..చదువే ముద్దు అనే నినాదంతో ప్రతీ కాలేజీలో అవగాహాన కల్పించనున్నారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాల గురించి వివరించనున్నారు. స్మార్ట్ సిటీ విశాఖలో డ్రగ్స్ కల్చర్ లేకుండా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు చెబుతున్నారు.