తాడికొండ టీడీపీలో డొక్కాతో శ్రవణ్‌ గొడవేంటి?

Update: 2019-11-01 12:08 GMT

చింత చచ్చినా పులుపు చావలేదన్న చందంగా వుంది కొందరు తెలుగుదేశం నేతల పరిస్థితి. ఒకవైపు పార్టీని బతికించుకోవడం కోసం చంద్రబాబు జిల్లాలు తిరుగుతూ, దీక్షలకు పిలుపునిస్తూ, ధాటిగా విమర్శలు చేస్తుంటే, కొందరు తమ్ముళ్లు మాత్రం, తమలో తాము కొట్టుకుంటూ, చంద్రబాబును మరింత విసుగెత్తిస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని ఇద్దరు నేతల మధ్య కోల్డ్‌‌వార్‌, బాబుకు బీపీ పెంచుతోంది.

నాలుగు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. గుంటూరు జిల్లాలో 17నియోజకవర్గాల్లో కేవలం రెండు నియోజకవర్గాల్లోనే ఆ పార్టీ అభ్యర్దులు విజయం సాధించారు. 2004 ఎన్నికల్లో ఒక్క సీటు మాత్రమే గెలిచిన టీడీపీ, మళ్లీ దశాబ్దం కాలం తర్వాత అతి తక్కువగా రెండే సీట్లు గెలిచింది. 2014లో జిల్లాలో 12 నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్దులు గెలిచారు. రాష్ట్ర్ర విభజన తర్వాత ఏపీకి కొత్త రాజధానిగా గుంటూరు జిల్లా తాడికొండ నియోజకవర్గంలో ఏర్పాటు చెయ్యడంతో, గుంటూరు జిల్లా టీడీపీకి కంచుకోటగా మారుతుందని చంద్రబాబు భావించారు. తాడికొండ నియోజకవర్గంలోని తుళ్లూరు, మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి, మంగళగిరి మండలాల్లోని 29 గ్రామాల్లో ఏపీ రాజధాని ఏర్పాటు చేశారు. రాజధాని ప్రకటించడంతో ఈ ప్రాంతవాసులు హర్షం వ్యక్తం చేశారు. రాజధాని ప్రాంతమైన తాడికొండలో అప్పటికే టీడీపీ తరపున పోటీ చేసి గెలిచిన తెనాలి శ్రావణ్ కుమార్ ఉన్నారు.

రాజధాని ప్రకటించిన తర్వాత ల్యాండ్ పూలింగ్ ద్వారా రైతులనుంచి 33వేల ఎకరాల భూమిని ప్రభుత్వం సేకరించింది. దీనిపై పలు ఆరోపణలున్నా, రాజధాని ఈ ప్రాంతంలో ఏర్పాటు చెయ్యడంతో చాలావరకు రైతులు లబ్దిపొందారు. రాజధాని ప్రాంతంగా మారిన తర్వాత తాడికొండ నియోజకవర్గం రాష్ట్రంలోనే కీలకంగా మారింది. దీంతో ఈ ప్రాంతంలో పెత్తనం కోసం టీడీపీ నేతలందరూ తమ ప్రయత్నాలు చేశారు. ఆధిపత్యం కోసం నేతలు చేసిన ప్రయత్నాలతో తాడికొండ నియోజకవర్గంలో టీడీపీ గ్రూపులుగా విడిపోయాయి.

అయితే నాలుగు నెలల క్రితం జరిగిన ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ కు సీటు ఇవ్వొద్దంటూ టీడీపీలో బలమైన సామాజికవర్గం నేతలు చంద్రబాబు వద్ద లాబీయింగ్ చేశారు. శ్రావణ్ కుమార్‌కు బాపట్ల ఎంపీ టికెట్ ఇచ్చి, బాపట్ల ఎంపీగా ఉన్న మాల్యాద్రికి తాడికొండ ఎమ్మెల్యే టికెట్‌ ఛాన్సిచ్చారు చంద్రబాబు. అయితే శ్రావణ్ కుమార్ వర్గీయులు చంద్రబాబు వద్ద సీట్ల మార్పుపై పంచాయతీ పెట్టారు. చివరకు చంద్రబాబు దిగివచ్చి మళ్లీ శ్రావణ్ కుమార్‌కే తాడికొండ టికెట్ ఇచ్చారు. అయితే ఎన్నికల్లో శ్రావణ్ కుమార్ ఓటమిపాలయ్యారు.

రాజధాని ప్రాంతమైన తాడికొండ నియోజకవర్గంలో ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ గెలుస్తుందని భావించిన చంద్రబాబుకు, ఓటమి భారీ షాక్ ఇచ్చిందనే చెప్పుకోవాలి. అయితే ఎన్నికల తర్వాత కూడా తాడికొండ టీడీపీలో ఆధిపత్య పోరు సద్దుమణగలేదు సరికదా, మరింతగా మండుతోంది. తాడికొండ నుంచి 2014, 2009లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలుపొందిన డొక్కా మాణిక్యవరప్రసాద్ మంత్రిగా కూడా పనిచేశారు. రాష్ట్ర విభజన తర్వాత డొక్కా సైలెంట్ అయ్యారు. రాయపాటి సాంబశివరావు శిష్యుడుగా ఉన్న డొక్కా టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలో చేరారు. రాయపాటి ఆశీస్సులతో డొక్కా ఎమ్మెల్సీ పదవి పొందారు. అప్పటి నుంచి తాడికొండపై కన్నేశారు.

గత ఎన్నికల్లో మరోసారి తాడికొండ నుంచి పోటీ చెయ్యాలని భావించినా సాధ్యం కాలేదు. దీంతో సైలెంట్‌గా ఉన్న డొక్కా మళ్లీ ఇప్పుడు తాడికొండలో రాజకీయం మొదలుపెట్టారు. కాంగ్రెస్ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు తాడికొండలో అనేకమంది టీడీపీ నేతలను రాజకీయంగా ఇబ్బందులు పెట్టారన్న ఆరోపణలు ఎదుర్కొన్నారు డొక్కా. మరికొంతమందిపై తప్పుడు కేసులు పెట్టించారట. అదే డొక్కా ఇప్పుడు టీడీపీలో చేరిన తర్వాత గ్రూపు రాజకీయాలకు తెరతీశారని తాడికొండలో జోరుగా ప్రచారం సాగుతోంది. టైం కోసం ఎదురు చూసిన డొక్కా, ఇప్పుడు తాడికొండపై ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేస్తున్నారని టాక్. తాడికొండలో తన అనుచరులతో పాటు శ్రావణ్ కుమార్ వ్యతిరేక వర్గీయులతో కలిసి పోయారు. ఇదంతా తాడికొండ ఇన్‌ఛార్జి పదవి కోసమేనని నియోజకవర్గంలో జోరుగా ప్రచారం సాగుతోంది.

నియోజకవర్గంలోని పార్టీ కార్యకర్తలకు శ్రావణ్ కుమార్ అందుబాటులో ఉండటంలేదని ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారం వెనుక డొక్కా వ్యూహం ఉందంటున్నారు. ఇదే విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు నారా లోకేష్ వద్దకు చేరేలా చెయ్యడంలో డొక్కా సక్సెస్ అయినట్లు టీడీపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. వచ్చే ఎన్నికల నాటికి డొక్కా మాణిక్యవరప్రసాద్ అయితేనే, మళ్లీ క్యాడరును బలోపేతం చేయగలరంటూ తన అనుచరులతో పాజిటివ్‌గా అధినేత దగ్గర చెప్పించినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ వర్గీయులు డొక్కా తీరుపై మండిపడుతున్నారు. శ్రావణ్ పార్టీకి విధేయుడని చెబుతున్నారు. పార్టీ కార్యకర్తలకు అందుబాటులో లేడని తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడుతున్నారు. అసలు డొక్కా మాణిక్యవరప్రసాద్ పార్టీ కార్యక్రమాల్లో ఎక్కడా పెద్దగా పాల్గొనడంలేదంటున్నారు. కేవలం తెరవెనుక ఉంటూ ఇలాంటి పనులు చేయటం ద్వారా పార్టీని చీల్చుతున్నారంటూ శ్రావణ్ కుమార్ బ్యాచ్ ఫిర్యాదులు చేస్తోంది. తాడికొండపై ఆధిపత్యం కోసం ఇద్దరు నాయకుల ఫిర్యాదులతో నియోజకవర్గంలో అలజడి రేగుతోంది. క్యాడరులో అయోమయ పరిస్థితి నెలకొంది.

ఎన్నికల్లో ఘోర పరాజయంతో పూర్తిగా డీలా పడిపోయిన టీడీపీకి, రాజధానిలో ఆధిపత్యపోరు తలనొప్పిలా మారింది. పార్టీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో మరింతగా వివాదాలను సృష్టించటంతో ఏం చెయ్యాలో తెలియక జిల్లా నేతలు కూడా సైలెంట్ అయిపోయారు. డొక్కా మాణిక్యవరప్రసాద్, శ్రావణ్ కుమార్‌ల మధ్య ఆధిపత్య పోరు ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుందోనని టీడీపీలో చర్చ జరుగుతోంది. చంద్రబాబు ఇద్దరి మధ్య జరుగుతున్న పోరుకు పుల్ స్టాప్ పెట్టకపోతే, రాజధానిలో టీడీపీ మరింతగా ఇబ్బందుల పాలవుతుందని కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Full View  

Tags:    

Similar News