మూడు రాజధానులు టు సంచయిత బీజేపీలో గందరగోళం క్యాహై.. నిజంగా జీవీఎల్‌కు నడ్డా క్లాస్ తీసుకున్నారా?

Update: 2020-03-07 11:51 GMT

పార్టీ అధిష్టానం ఒకటి తలిస్తే, అదే పార్టీ నాయకుడు మరోటి తలుస్తాడా...? గల్లీ నుంచి ఢిల్లీ వరకూ పార్టీ విధానం ఒకటే వుంటుందా లేదంటే, పూటపూటకు, ప్రాంతం ప్రాంతానికి, నేత నేతకూ మారిపోతూ వుంటుందా....? ఆంధ్రప్రదేశ్‌ బీజేపీలో నేతల తీరు చూస్తుంటే, ఇదే డౌట్ అందరికీ కలుగుతోంది. ఇంతకీ ఢిల్లీ బీజేపీ ఏం తలుస్తోంది ఏపీ బీజేపీ ఎలా నడుచుకుంటోంది? కన్‌ఫ్యూజ్‌ అవుతున్నారా కన్‌ఫ్యూజ్ చేస్తున్నారా?

మూడు రాజధానుల నుంచీ సంచయిత నియామకం వరకు - ఆంధ్రప్రదేశ్‌ కమలం నేతల తలోమాట..తలోబాట - జీవీఎల్ ఒకటంటే.. స్టేట్ లీడర్లు మరోటనడం ఏంటి? క్లారిటీ మిస్సవుతోందా? కావాలనే కన్‌ఫ్యూజ్‌ చేస్తున్నారా? - నిజంగా జీవీఎల్‌కు నడ్డా క్లాస్ తీసుకున్నారా?

ఎక్కడైనా, ఏ రాజకీయ పార్టీ అయినా, ఒకే విధానం, ఒకే తీర్మానం, ఒకే మాట వుంటుంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పాలసీ విధానాల్లో తేడా వుండదు. ఢిల్లీ ఏం శాసిస్తుందో, గల్లీ అదే పాటిస్తుంది. ప్రాంతాలకు అతీతంగా నేతలందరూ పార్టీ విధానాలనే వల్లె వేస్తుంటారు. అయితే, ఇందులో కాంగ్రెస్‌కు కొంత మినహాయింపునిచ్చినా, క్రమశిక్షణ గల పార్టీగా చెప్పుకునే భారతీయ జనతా పార్టీ కూడా, ఈమధ్య అదే తీరులో నడుస్తోందన్న చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో.

ఆంధ్రప్రదేశ్‌‌కు మూడు రాజధానుల అంశమే తీసుకుందాం. రాష్ట్ర పార్టీ నేతలు ఒక తీరుగా మాట్లాడితే, జాతీయ నేతలు మాత్రం మరోరకంగా మాట్లాడుతారు. మూడు రాజధానుల అంశంలో కేంద్రం జోక్యం చేసుకుంటుందని, అనుమతి తప్పకుండా వుండాల్సిందేనని, బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీ సుజనా చౌదరి అంటారు. స్టేట్ బీజేపీ లీడర్లు సైతం ఇదేవాదన అటూఇటూగా చెబుతూ, అమరావతి రైతులకు భరోసా ఇస్తున్నారు. కానీ బీజేపీ అధిష్టానంతో అత్యంత సన్నిహితంగా వుండే, జాతీయ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు మాత్రం, ఇందుకు భిన్నంగా స్పందిస్తారు. అసలు మూడు రాజధానుల వ్యవహారంలో కేంద్రం జోక్యం వుండదని కుండబద్దలు కొడతారు. ఇది తన అభిప్రాయం కాదని, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ హైకమాండ్‌ ఆలోచనగా ఫుల్‌క్లారిటీగా చెబుతారు. ఇలా బీజేపీ ఎంపీలు, రాష్ట్ర నేతలు ఒక రకంగా మాట్లాడితే, జీవీఎల్‌ మాత్రం ఇంకోలా మాట్లాడతారు. కన్‌ఫ్యూజ్‌ అవుతున్నారా కావాలనే కన్‌ఫ్యూజన్‌లో జనాలను పెట్టే ప్రయత్నం చేస్తున్నారా అన్నది, ఎవ్వరికీ బోధపడ్డంలేదు.

ఇక సింహాచలం అప్పన్న ఆలయ ట్రస్టు, మాన్సాస్ ట్రస్టు చైర్‌ పర్సన్‌గా ఆనంద గజపతి రాజు కుమార్తె సంచయిత గజపతి నియామకంపైనా, రాష్ట్ర బీజేపీ నేతలు తలోవిధంగా స్పందిస్తున్నారు. బీజేపీ యువ మోర్చా నాయకురాలైన సంచయితను, ప్రసిద్ద ట్రస్టుల చైర్‌ పర్సన్‌గా నియమించడాన్ని ఖండించారు నేతలు. బీజేపీలో కీలక నేతగా ఉన్న సంచయిత, కనీసం పార్టీ నేతలకు కూడా సమాచారం ఇవ్వకుండా వైసీపీ ఆఫర్‌ను అంగీకరించడం దారుణమంటున్నారు నేతలు. సంచయితను బీజేపీ నుంచి బహిష్కరించాలని, కేంద్రానికి లేఖరాసినట్లు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ బీజేపీలో ఇంత గందరగోళం రాజ్యమేలుతోంది. అటు మూడు రాజధానులపై ఒక్కొక్కరూ ఒక్కోలా మాట్లాడుతుంటే, ఇటు బీజేపీ యువ నాయకురాలుగా వ్యవహరిస్తున్న సంచయిత, వైసీపీ ప్రభుత్వం ఆఫర్ చేసిన పదవిని, క్షణాల్లో స్వీకరించారు. సంచయితను ట్రస్టుల చైర్‌ పర్సన్‌గా నియమించడం తమకు తెలీనే తెలీదని, బీజేపీ నేతలు అనడం విడ్డూరమంటున్నారు స్థానిక ప్రజలు. బీజేపీ అధిష్టానం సిఫారసు చేసినందుకే, జగన్ సర్కారు ఇలాంటి నిర్ణయం తీసుకుని వుండొచ్చని అనుమానిస్తున్నారు. ఇలా బీజేపీలో ఏం జరుగుతుందో, ఎవరేం మాట్లాడుతున్నారో, ఎవరికీ అర్థంకావడం లేదు.

ఇక బీజేపీలో ఈ కన్‌ఫ్యూజన్‌ కాస్త, కోల్డ్‌వార్‌కు దారి తీసేలా వుంది. వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, మాట్లాడుతున్నారని జీవీఎల్‌పై ఏకంగా హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారట రాష్ట్ర బీజేపీ నేతలు. తామొకటి మాట్లాడితే, జీవీఎల్ మరోటి మాట్లాడుతున్నారని, దీంతో రాష్ట్రంలో తమ పరపతి తగ్గిపోతోందని, తమ మాటకు అసలు విలువే లేకుండాపోతోందని రగిలిపోతున్నారట. ఒకే పార్టీలో ఇన్ని రకాల మాటలను చూసి, జనం ఎదుట నవ్వులపాలు అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. అందుకే జీవీఎల్‌ను కంట్రోల్‌ చెయ్యాలని, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జగత్‌ ప్రకాశ్‌ నడ్డాకు ఫిర్యాదు చేశారట. దీంతో జీవీఎల్‌ను పిలిపించుకుని, నడ్డా క్లాస్ తీసుకున్నట్టు మీడియాలో ప్రచారం జరుగుతోంది.

అయితే, మూడు రాజధానులతో పాటు వైసీపీతో బీజేపీ సంబంధాలపై కమలం నేతలు కావాలనే కన్‌ఫ్యూజన్‌‌గా మాట్లాడుతున్నారన్న చర్చ కూడా వుంది. ఎందుకంటే, టీడీపీ తరహాలో అమరావతికే జైకొడితే, మిగిలిన ఉత్తరాంధ్ర, సీమలో పార్టీకి ఇబ్బంది తప్పదు. అందుకే బీజేపీలో కొందరు అమరావతిని సమర్థిస్తుంటే, జీవీఎల్‌ లాంటి నేతలు మూడు రాజధానుల వ్యవహారంలో రాష్ట్రానికే స్వేచ్చ వుంటుందని, ఇన్‌డైరెక్టుగా సపోర్ట్ ఇస్తున్నారు. స్ట్రాటజీలో భాగంగానే కమలం నేతలు గందరగోళం సృష్టిస్తున్నారని విశ్లేషకులంటున్నారు.


Full View


Tags:    

Similar News