Notice to YSR Congress Party : ఎన్నికల సంఘం, యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ(వైసీపీ)కి ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తమ పార్టీ పేరును పోలివున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలంటూ అన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేసిన పిటిషన్ పై ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది ఢిల్లీ హైకోర్టు. తదుపరి విచారణను సెప్టెంబర్ 3కు వాయిదా వేసింది. అప్పటిలోగా కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశించింది.
వైఎస్ జగన్ నేతృత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. కడపకు చెందిన అన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు మహబూబ్ బాషా ఈ పిటిషన్ వేశారు. దీనిపై హైకోర్టు విచారణకు స్వీకరించి విచారణ జరిపింది. మహబూబ్ బాషా ఇప్పటికే ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి బదులు వైఎస్సార్ పేరును ఉపయోగించడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ వినతి పత్రం అందించారు.