Cryptocurrency Case: ఏపీలో క్రిప్టో కరెన్సీ సూసైడ్ కేసు మూలాలు
* సూర్యాపేటలోని ఓ లాడ్జీలో రామలింగస్వామి సూసైడ్ * ట్రస్ట్ వాలెట్ యాప్‌లో రామలింగస్వామి పెట్టుబడులు
Cryptocurrency Case: ఏపీలో క్రిప్టో కరెన్సీ మూలాలు వెలుగు చూస్తున్నాయి. సూర్యాపేటలోని ఓ లాడ్జీలో రామలింగస్వామి సూసైడ్‌తో ఈ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఈఎస్పీఎన్, ఈ-మైక్రోబిట్, ఫాలో యాప్, ట్రస్ట్ వాలెట్ యాప్‌లలో రామలింగస్వామి పెట్టుబడులు పెట్టేవారు.
అయితే ఈ యాప్‌ల ద్వారానే రామలింగస్వామికి కృష్ణాజిల్లా వాసి లక్ష్మీనరసింహం అలియాస్ బాబి పరిచయమయ్యాడు. ఈ ఇద్దరూ కలిసి ట్రస్ట్ వాలెట్ యాప్‌లో కోటి రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఆ కోటికి మరో కోటి రూపాయలు లాభం వచ్చింది. ఆ తర్వాత కొన్ని రోజులకు వారి ఇరువురి మధ్య మాట, మాట పెరిగి విడిపోయారు.
అనంతరం కృష్ణా జిల్లా శివపురం సర్పంచ్ లక్ష్మణరావుతో కలిసి పలు యాప్‌లలో పెట్టుబడి పెట్టాడు బాబి. ఆ యాప్‌లు నకిలీవి కావడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. అయితే.. నష్టపోయిన డబ్బులను రికవరీ చేసుకునేందుకు రామలింగస్వామిని మరోసారి కలిశాడు బాబి.
అక్టోబర్ 22న పెనుగంచిప్రోలులోని ఓ కల్యాణ మండపంలో రామలింగస్వామితో బాబి, లక్ష్మణరావు సిట్టింగ్ ఏర్పాటు చేశారు. రామలింగస్వామి తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఈ సిట్టింగ్‌కు వెళ్లారు.
ఇదిలా ఉంటే తన వల్లే నష్టపోయామంటూ రామలింగస్వామితో వాగ్వాదానికి దిగాడు బాబి. రామలింగస్వామి, అతని స్నేహితులను బంధించి దాడికి దిగారు. అతడి నుంచి రెండు కార్లు, బ్యాంక్ అకౌంట్లోని నగదు, బంగారంతో పాటు పలు పత్రాలపై సంతకాలు తీసుకున్నారు బాబి, లక్ష్మణరావు.
అనంతరం వారిని వదిలిపెట్టారు. ఈ ఘటనపై బాధితులు పోలీసులను ఆశ్రయించినప్పటికీ ఫలితం లేదు. దాని తర్వాత ఈ నెల 10న రామలింగస్వామికి మరోసారి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు బాబి, లక్ష్మణరావు. మిగిలిన డబ్బు చెల్లించి కార్లు తీసుకెళ్లాలని వార్నింగ్ ఇచ్చారు.
ఈ నెల 12న స్నేహితులతో కలిసి జగ్గయ్యపేటకు వెళ్లిన రామలింగస్వామి మరో 14 లక్షలు ఇచ్చి కార్లు ఇచ్చేయమని అడిగాడు. దానికి నిరాకరించిన బాబి, లక్ష్మణరావు మరోసారి రామలింగస్వామితో పాటు అతడి ఫ్రెండ్స్‌పై దాడి చేశారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన రామలింగస్వామి సూర్యాపేటలోని ఓ లాడ్జీలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
సూసైడ్‌నోట్‌లో తాను ఆన్‌లైన్ బిజినెస్‌లో లాస్ అయ్యానని, ఎవరికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేదంటూ రాసుకొచ్చారు. అలాగే పిల్లలు జాగ్రత్త అంటూ తన భార్య గురించి ప్రస్తావించారు. ఇక విషయం తెలసుకున్న తన భార్య స్వాతి పోలీసులను ఆశ్రయించింది. తన భర్త ఆత్మహత్యకు బాబి, లక్ష్మణరావే కారణమంటూ ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.