Floods in AP: పంట నష్టం 20వేల హెక్టార్ల పైమాటే.. యుద్ధప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ
Floods in AP: ఏపీలో గోదావరి ప్రవాహం వల్ల దాని పరివాహక ప్రాంతాల్లోని పంటలు నీట మునిగాయి.
Floods in AP: ఏపీలో గోదావరి ప్రవాహం వల్ల దాని పరివాహక ప్రాంతాల్లోని పంటలు నీట మునిగాయి. దీనికి సంబంధించి వ్యవసాయశాఖ కమీషనర్ 20వేల హెక్టార్లకు పైగా నీట మునిగినట్టు ప్రాధమిక అంచనాకు వచ్చారు. దీంతో పాటు వరదల వల్ల నిలిచిపోయిన విద్యుత్ ను సకాలంలో పునరుద్ధరణ చేసేందుకు ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీంతో పాటు సహాయక శిబిరాల్లో నివాసముంటున్నవారికి అన్ని సేవలు అందించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తోంది.
రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు 20 వేలకు పైగా హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. పంటలు ఎంత మేర దెబ్బ తిన్నాయో పరిశీలన చేస్తున్నట్టు వ్యవసాయ శాఖ కమిషనర్ హెచ్.అరుణ్‌కుమార్ చెప్పారు. ప్రాథమిక అంచనా ప్రకారం పది రకాల ఆహార పంటలు దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న పంటల్లో మొక్కజొన్న, పెసర పంటలు ఎక్కువగా ఉన్నాయి.
ఒక్క కర్నూలు జిల్లాలో 11,968.8 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నట్టు అధికారులు గుర్తించారు. నెల్లూరు జిల్లాలో 205 హెక్టార్లు, పశ్చిమ గోదావరిలో 1,613.07 హెక్టార్లు, తూర్పుగోదావరిలో 2,610, కృష్ణాలో 3,715 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. గోదావరి డెల్టా ప్రాంతంలో వరి నారుమళ్లలో నీళ్లు నిలిచి ఉన్నట్టు గుర్తించారు. కృష్ణా జిల్లాలో పెసర పంట దెబ్బతింది. నష్టపోయిన పంటలకు పెట్టుబడి రాయితీ ఇచ్చేందుకు అధికారులు ఎన్యూమరేషన్ చేస్తున్నారు.
వరదల వల్ల ఉభయగోదావరి జిల్లాల్లో విద్యుత్ వ్యవస్థకు జరిగిన నష్టంపై సీఎం వైఎస్ జగన్ సోమవారం మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఉన్నతాధికారులతో కలిసి సమీక్షించారు. విద్యుత్‌ను పునరుద్ధరించే వరకు సిబ్బంది అక్కడే ఉండాలని సీఎం సూచించారు. వీలైనంత త్వరగా అన్ని గ్రామాలకు విద్యుత్ అందించాలన్నారు. ప్రభుత్వం విద్యుత్ శాఖకు అన్ని విధాల తోడ్పాటునందిస్తుందని తెలిపారు. వరద ప్రాంతాల్లో పరిస్థితిని, విద్యుత్ శాఖ అప్రమత్తమైన తీరును ఇంధన శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లి వివరించారు.
రాత్రింబవళ్లు పునరుద్ధరణ పనులు
► ఉభయగోదావరి జిల్లాల్లోని నాలుగు మండలాలు.. నెల్లిపాక, వీఆర్‌పురం, కూనవరం, చింతూరుల్లో ఉన్న 133 గ్రామాల్లో ఆదివారం అర్ధరాత్రి నుంచి విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. 10,998 సర్వీసులకు సరఫరా ఆగిపోయింది. మరో 1,528 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు విద్యుత్ సరఫరా నిలిపేయాల్సి వచ్చింది. నీటి ముంపుతో ఏలూరు డివిజన్‌లో రెండు 11 కేవీ ఫీడర్లు విద్యుత్ సరఫరా ఆపేశాయి. 916 ట్రాన్స్‌ఫార్మర్లు నీటమునిగాయి.
► పోలవరం ముంపు మండలాల్లోనే నష్టం ఎక్కువగా ఉంది. పరిస్థితిని అంచనా వేసి ముందే అక్కడకు అదనపు సిబ్బందిని పంపాం. ప్రస్తుతం రాత్రింబవళ్లు పునరుద్ధరణ పనులు జరుగుతున్నాయి. అవసరమైన సామాగ్రిని పడవల ద్వారా చేరవేస్తున్నారు. సోమవారం రాత్రికల్లా 90 శాతం విద్యుత్ పునరుద్ధరణ పూర్తికావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.
► గ్రామాలను వరద నీరు ముంచెత్తడంతో సిబ్బంది అక్కడ నిలబడే వీలు లేకపోయినా విద్యుత్ పునరుద్ధరణ వేగంగానే సాగుతోంది. విరిగిపోయిన స్తంభాలను గుర్తించి తక్షణ చర్యలు చేపడుతున్నారు.
► తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయి పరిస్థితిని తెలుసుకుని అవసరమైన ఆదేశాలిస్తున్నారు. విద్యుత్ సౌధలో అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశాం.