Coronavirus: కరోనా వైరస్ కోరలు చాస్తుండడంతో ఆ జిల్లా వాసులు హడలిపోతున్నారు. వైరస్ కాటుతో ప్రజలు ప్రాణ భయంతో వణికిపోతున్నారు. నిబంధనలు పాటించకపోవడంతో అన్నిచోట్ల కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. వైరస్ వ్యాపిస్తున్న తీరుతో సామాజిక వ్యాప్తి మొదలైందన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి.
తూర్పు గోదావరి జిల్లాలో కరోనా మహమ్మారి విశ్వరూపం దాలుస్తోంది. జిల్లాలోని ఏలూరు నగరంలో నిబంధనలు ఉల్లంఘిస్తుండటంతో పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. జిల్లాలో నమోదవుతున్న ఎక్కువ కేసులు ఏలూరు చుట్టుప్రక్క ప్రాంతాల్లోనే నమోదవుతున్నాయి. కోవిడ్ సెంటర్లు బాధితులతో నిండిపోతుంటే ఇవేవి పట్టనట్టుగా మందుబాబులు మాత్రం మద్యం దుకాణాల వద్ద క్యూ కడుతున్నారు. దీంతోకరోనా మరింత తీవ్ర స్థాయిలో విజృంభించే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
ఏలూరు నగరంతో పాటు జిల్లాలోని తాడేపల్లిగూడెం, పాలకొల్లు, భీమవరం, నరసాపురంలలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. ఈ నియోజకవర్గాల పరిధిలోని మండల కేంద్రాలు, గ్రామాలలో లాక్ డౌన్ నిబంధనలు గాలి కొదిలేయడంతో కేసులు భారీగా నమోదవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు పాజిటివ్ కేసుల సంఖ్య 10వేల మైలురాయిని దాటిపోయింది. కేసుల పెరుగుదల జిల్లా వాసులను కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. గడిచిన నెల రోజుల నుంచి రోజుకు సుమారు వెయ్యికి చేరువలో కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో కొందరు టెస్టులు చేయించుకోవడానికి నిరాకరిస్తుండటం మరింత కలవరానికి గురిచేస్తోంది.