పశ్చిమ గోదావరి జిల్లాను వణికిస్తున్న కరోనా కేసులు

కరోనా వైరస్ మహమ్మారి మరింత వికృత రూపం దాల్చింది. రాష్ట్రాలు, నగరాలు, జిల్లాలు అనితేడా లేకుండా విలయతాండవం చేస్తోంది.

Update: 2020-06-04 13:32 GMT

కరోనా వైరస్ మహమ్మారి మరింత వికృత రూపం దాల్చింది. రాష్ట్రాలు, నగరాలు, జిల్లాలు అనితేడా లేకుండా విలయతాండవం చేస్తోంది. రోజురోజుకూ దూకుడు చూపుతూనే ఉంది. వైరస్ ఎటు నుంచి ఎలా ఎటాక్ చేస్తుందో ఎవరికీ అర్థం కావట్లేదు. పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. పంజా విరుస్తున్న వైర‌స్‌తో ఆ జిల్లాలో కొంప ముంచేటట్లుందే.

మొన్నటి వరకూ కరోనా కేసులతో అట్టుడికిన పశ్చిమగోదావరి జిల్లాలో క్రమంగా కేసులు తగ్గుముఖం పడడం... ఇంతలోనే కేసులు పెరగడం కలవరపాటుకు గురిచేస్తోంది. ప్రభుత్వం లాక్‌డౌన్‌ సడలింపు లివ్వడంతో ఇప్పుడిప్పుడే వ్యాపార వాణిజ్య కేంద్రాలు తెరుచుకుంటున్నాయి. జనం ఇళ్ల నుంచి బయటకు వచ్చి తమ పన్నుల్లో నిమగమవుతున్నారు. కానీ ఇంతలోనే చాపకింద నీరులా కరోనా వైరస్‌ జిల్లాల్లో విజృంభిస్తోంది.

లాక్‌డౌన్‌ టైంలో ఇతర జిల్లాలతో పొలిస్తే చాలా తక్కువగా ఉన్నప్పటికి... ఇప్పుడు కృష్ణా, గుంటూరు జిల్లాలకు గట్టిపోటినిస్తున్నాయి. 54 రోజుల వ్యవధిలో సెంచరీ దాటిన కేసులు.. ఇప్పుడు కేవలం వారం రోజుల్లోనే ఆ సంఖ్యకు చేరుకుంటున్నాయి. ఓ వైపు అనుమానిత కేసులు... మరోవైపు పాజిటివ్‌ కేసులతో జిల్లావాసులు భయాందోళన చెందుతున్నారు. ఇక ఏలూరు, పెనుగొండ మండలాల్లో.. రోజు రోజుకుపెరుగుతున్న కేసులతో అనేక ఏరియాలను రెడ్‌జోన్లుగా ప్రకటిస్తున్నారు అధికారులు.

మరోవైపు జిల్లాలో నిర్ధారణ పరీక్షల వేగం పెంచడంతో ఒక్కసారిగా కేసుల తీవ్రత పెరుగుతుందని స్థానికులు వాపోతున్నారు. తూర్పువీధి, పడమర వీధి, పొణంగి ప్రాంతాల్లో కొత్తగా కేసులు నమోదు అవుతుండటంతో జనం వణికిపోతున్నారు. వృద్ధుల నుంచి యువకులు, చిన్నపిల్లలు అని తేడా లేకుండా పంజా విస్తురుతుండటంతో ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమై ప్రజలకు మరింత అవగాహన కల్పించాలని పలువురు కోరుతున్నారు.

పాటించాల్సిన జాగ్రత్తలు తెలిసినా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారు కొందరైతే... అవగాహన కరువై పాజిటివ్‌ బారిన పడుతున్న వారు మరికొందరు. బాధ్యతారహిత్యంగా వ్యవహరిస్తున్న వారి సంఖ్య వల్ల జిల్లాలో కరోనా కోరలు చాచి విశ్వరూపం చూపుతోంది. ఇప్పటికే జిల్లాలో డబుల్‌ సెంచరీకి చేరువవుతుంటే.. ఇంకా మూడు వేలకు పైగా పరీక్షలు నిర్ధారణ కావాల్సి ఉంది. ఈ ఫలితాలు వస్తే పాజిటివ్‌ కేసుల ఏ స్థాయికి చేరుకుంటాయో వేచి చూడాలి మరి.


Tags:    

Similar News