గోదావరి జిల్లాల ఆక్వా రంగంపై కరోనా ఎఫెక్ట్
Coronavirus: డాలర్ల పంటగా పిలిచే ఆక్వా రంగంలో ఎన్నో కన్నీటి కష్టాలు ఉన్నాయి.
Coronavirus: డాలర్ల పంటగా పిలిచే ఆక్వా రంగంలో ఎన్నో కన్నీటి కష్టాలు ఉన్నాయి. సాగు ప్రారంభం నుంచి దిగుబడి వరకూ రైతుల కష్టం అంతా ఇంతా కాదు. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉంటేనే పంట చేతికి దక్కేది లేకపోతే తీవ్ర నష్టాలు తప్పవు. చేపల రైతుల పరిస్థితి ఆశాజనకంగా ఉన్న పరిస్థితుల్లో కరోనా మహమ్మారి దెబ్బ కొట్టింది. దీంతో ఎగుమతి లేక గిట్టుబాటు ధర రాక రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
గోదావరి జిల్లాలు అంటే ఆక్వా రంగానికి పెట్టింది పేరు. అయితే ప్రస్తుతం రొయ్య రైతును చేప కన్నీళ్లు పెట్టిస్తుంది. గత కొంత కాలంగా చేపలకు సరైన గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు డీలా పడ్డారు. రొయ్యల రైతులకు కాలం కలిసొస్తే కనకవర్షం లేదంటే కష్టాల కడలిలో చిక్కుకోవడం సర్వసాధారణం. గతంలో డాలర్ల పంటైన రొయ్యల సాగు సంక్షోభంలో కూరుకుపోతే ఆక్వా రైతులకు చేపల సాగే అండగా నిలిచింది. ప్రస్తుతం మాత్రం చేప సాగు కష్టాల సుడిగుండంలో చిక్కుకుంది.
చేపల సాగుపై కరోనా ఎఫెక్ట్ భారీగా పడింది. గత ఏడాది నుంచి సరైనా ధరలు లేక రైతులు విల్లవిల్లాడుతున్నారు. పశ్చమ గోదావరి జిల్లా నుంచి సాధారణ రోజుల్లో రోజుకు 300 చేపల లారీలు ఎగుమతి అయ్యేవి. ప్రస్తుతం అది 150కు తగ్గిపోయింది. కొవిడ్ ప్రభావంతో ఉత్తర భారతదేశం, ఈశాన్య రాష్ట్రాల్లో చేపల మార్కెట్లు పూర్తిస్థాయిలో తెరవలేదు. దీంతో వెళ్లిన లారీలు రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతేడాది కొవిడ్ ప్రభావం రొయ్యల ఎగుమతులపై పడటంతో ధరలు తగ్గి రైతులు నష్టపోయారు. ప్రభుత్వం జోక్యం చేసుకుని నిర్ణయించిన ధరల ప్రకారమే రైతుల నుంచి కొనుగోలు చేయడం మంచి ఫలితాలను ఇచ్చింది. ప్రస్తుతం పలు దేశాల్లో రొయ్యలకు గిరాకీ ఏర్పడటంతో ధరలు సంతృప్తికరంగా ఉన్నాయి.
మొత్తంగా పలు రాష్ట్రాల్లో అమల్లో ఉన్న కొవిడ్ ఆంక్షలే చేపల రంగం గడ్డుపరిస్థితికి కారణం గా నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు కొత్త ఆక్వా చట్టం ద్వారా ఈ రంగం అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పలు చర్యలు చేపట్టింది. ఆక్వాహబ్‌ల ఏర్పాటు దిశగా యత్నాలు జరుగుతున్నాయి.