Coronavirus Effect: బంగినపల్లి మామిడిపై కరోనా ఎఫెక్ట్

Coronavirus Effect: పండ్లలో రారాజు మామిడిపండు. అందులోనూ బంగిన పల్లి మామిడి తింటే ఆ రుచే వేరు.

Update: 2021-06-03 05:55 GMT

Coronavirus Effect: బంగినపల్లి మామిడిపై కరోనా ఎఫెక్ట్

Coronavirus Effect: పండ్లలో రారాజు మామిడిపండు. అందులోనూ బంగిన పల్లి మామిడి తింటే ఆ రుచే వేరు. సీజన్‌లో అత్యధికంగా అమ్ముడయ్యే మామిడి పండ్ల రకాల్లో ఇదే నెంబర్ వన్. అలాంటి బంగిన పల్లి మామిడి పండుపై కరోనా ఎఫెక్ట్ పడింది. దీంతో భారీగా నష్టం చవి చూస్తున్నారు రైతులు.

వేసవి వచ్చిందంటే మామిడి పండ్లకు ఉండే గిరాకీ అంతా ఇంతా కాదు. నోరూరించే మామిడిపండ్ల కోసం పరుగులు తీస్తారు జనం. అందులోనూ కర్నూలు జిల్లాలోని బంగిన పల్లి మామిడి పండు డిమాండ్ గురించి చెప్పనక్కర్లేదు. ఈ పండు రుచి అలా కట్టి పడేస్తుంది. ఈ బంగిన పల్లి మామిడి పండుకు దేశావిదేశాల్లో కూడా డిమాండ్ ఉండటంతో ఈ పంటను నమ్ముకుని ఎందరో రైతులు బతుకుతున్నారు.

కర్నూలు జిల్లాను బ్రిటిష్ హయాంలో నవాబ్‌లే ఎక్కువ పాలించారు. ఆ సమయంలో నవాబ్‌లు టర్కీ, ఔరంగాబాద్ ప్రాంతాల నుంచి, ఇతర దేశాల నుంచి మేలు రకం మామిడి మొక్కలు తెప్పించకుని బనగానపల్లెలో వాటిని సాగు చేయించేవారు. అంట్లు కట్టి మేలు రకం మామిడి చెట్లు పెంచారు. అలా పెంచిన మామిడి చెట్లలో బంగినపల్లి మామిడి ఒకటి. ఆ పండే బేనిషాగా పేరుపొంది కాల క్రమేణా బంగిన పల్లి బెనిషా గా మారి పోయింది.

బనగానపల్లెకు సమీపంలోని కౌసర్ బాగ్ అనే తోటలో నవాబ్ 5వేల బంగిన పల్లి మామిడి చెట్లు పెంచాడు. వాటిని ఆయన వారసులు రక్షిస్తూ రాగా అంతరించి పోతున్న సమయంలో మరి కొందరు రైతులు ఈ రకం మామిడి సాగుకు నడుం బిగించారు. ప్రస్తుతం వందలాది మంది రైతులు, వారి కుటుంబాలకు ఇదే జీవనాధారం. అయితే ఒకప్పుడు సిరులు కురిపించిన బంగినపల్లి మామిడి ఇప్పుడు అప్పులు తెచ్చి పెడుతోంది. కరోనాతో గతేడాది పంట ఎగుమతి కాలేదు ఈ ఏడాది అయినా కష్టాల నుంచి బయట పడదాం అనుకుంటే సెకండ్ వేవ్ కరోనా మళ్ళీ కొంప ముంచింది. పంట కోసం లక్షలు అప్పు చేసిన రైతులు దిక్కు తోచని పరిస్థితిలో పడి పోయారు. కరోనా కారణంగా మామిడికి ఎగుమతి లేక తోటల్లోనే పండ్లు మగ్గుతున్నాయి. దీంతో ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరుతున్నారు మామిడి రైతులు.

Tags:    

Similar News