Coronavirus Effect: దుర్గ ఆలయంలో కరోనా ఆందోళన.. సిబ్బందికి పెరుగుతున్న కేసులు
Coronavirus Effect: కరోనా అక్కడ ఇక్కడ అని లేకుండా విస్తరిస్తూ తన ప్రతాపాన్ని చూపిస్తుంది.
Coronavirus Effect: కరోనా అక్కడ ఇక్కడ అని లేకుండా విస్తరిస్తూ తన ప్రతాపాన్ని చూపిస్తుంది. తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి ఆలయం తరువాత పేరొందిన విజయవాడ కనకదుర్గమ్మ దేవాలయానికి కరోనా సెగ తగిలింది. ఇక్కడ సిబ్బందికి నిర్వహించిన రెండు సార్లు పరీక్షల్లో కేసులు నమోదవుతుండటంతో అంతా ఆందోళన చెందుతున్నారు. మిగిలిన వాటితో పోలిస్తే కేసులు తక్కువే అయినాఒకసారి ఆలయాన్ని మూసివేయాల్సి వచ్చింది.
కరోనా వైరస్ బెజవాడ దుర్గగుడి సిబ్బందిని వణికిస్తోంది. ఇప్పటికే ఆలయంలోని కీలక అధికారితో పాటు ఐదరుగురు సిబ్బంది కరోనా బారిన పడగా తాజాగా మరో ఏడుగురుకు పాజిటివ్ రావడం ఇంద్రకీలాద్రిపై చర్చనీయాశంగా మారింది. ఇప్పటికీ రెండుసార్లు సిబ్బందికి వైద్య పరీక్షలు చేయించారు. గతంలో ఒక వేదపడింతుడు, ఉద్యోగి కరోనాతో చికిత్స పొందుతూ మృతిచెందారు. అయితే వారికి కరోనాతో పాటు ఇతర శ్వాస సంబంధమైన ఇబ్బందులు ఉన్నాయి. మిగిలిన వారు సురక్షితంగా బయట పడ్డారు. తాజాగా గత వారం దుర్గగుడిలో రెండోసారి 393 మందికి పరీక్షలు నిర్వహించారు. అందులో ఏడుగురికి పాజిటివ్ అని తేలింది. ఇంకా 450 మంది వరకు పరీక్షలు చేయించుకోవాల్సి ఉంది.
సిబ్బందిలో ఆందోళన
కరోనా పరీక్షలు చేసే వరకు వ్యాధి బయటపడటం లేదు. దీంతో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుతం కొండపై పరిస్థితి మారిపోయింది. ఆలయంలో రోజూ శానిటైజ్ చేసినా, మాస్క్‌లు ధరించినా రోజు ఎవరో ఒకరు కరోనా బారిన పడ్డారనే సమాచారం వస్తూ ఉండటంతో వారు ఆందోళన చెందుతున్నారు.
మిగిలిన ఆలయాతో పోల్చితే తక్కువే...
శ్రీశైలం, అన్నవరం తదితర ఆలయాలతో పోల్చితే ఇక్కడ కరోనా సోకిన సిబ్బంది తక్కువగానే ఉన్నారని అధికారులు చెబుతున్నారు. ఆయా దేవాలయాల్లో 25 మంది కంటే ఎక్కువ మంది సిబ్బంది కరోనాకు గురికావడంతో ఏకంగా దేవాలయాలను కొద్దిరోజులు మూసివేశారు. ఇక్కడ అలా కాదు. లాక్‌డౌన్ సడలించిన తరువాత ఒక్కరోజు కూడా ఆలయాన్ని మూసివేయలేదు. దీనికి రక్షణ చర్యలే కారణమని ఈఈ భాస్కర్ తెలిపారు.