AP Corona: ఏపీలో విజృంభిస్తోన్నకరోనా
Ap Corona: తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కరోజే 168 కేసులు బయటపడడం తీవ్ర కలకలం రేపింది.
AP Corona: ఏపీలో కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్నాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా సెకండ్ వేవ్ ఆందోళన నెలకొంది. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 33వేల 634 శాంపిల్స్‌ను పరీక్షించగా 492 మందికి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లాలో ఒక్కరోజే 168 కేసులు బయటపడడం తీవ్ర కలకలం రేపింది. కృష్ణా జిల్లాలో 63 మందికి వైరస్ సోకగా.. చిత్తూరులో 56, గుంటూరులో 47, విశాఖపట్నంలో 46 అనంతపురంలో 29 కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 8లక్షల 94వేల 536కి పెరిగింది. ఒకరోజు వ్యవధిలో 256 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తం రికవరీల సంఖ్య 8లక్షల 84వేల 727కి చేరుకుంది. ప్రస్తుతం రాష్ట్రంలో 2వేల 616 యాక్టివ్ కేసులున్నాయి. కరోనాతో తాజాగా ఇద్దరు మృతి చెందడంతో మొత్తం మరణాలు 7వేల 193కి పెరిగాయి.
స్వరూపాన్ని మార్చుకుంటోన్న కరోనా...
కరోనా నిత్యం తన విలక్షణ స్వరూపాన్ని మార్చుకుంటోంది. వైరస్ సోకిన వారిలో ప్రధానంగా జ్వరం, గొంతు నొప్పి, దగ్గు, జలుబు, రుచి, వాసన తెలియకపోవడం వంటి లక్షణాలను ఇప్పటి వరకు గుర్తించారు. తాజాగా మరో మూడు కొత్త లక్షణాలను కూడా గుర్తించినట్టు అంతర్జాతీయ వైద్యులు ప్రకటించారు. వీటిలో ప్రధానంగా వినికిడి శక్తి తగ్గిపోవడం, చెవుల్లో రింగుమనే శబ్ధాలు వినబడటం, తల తిరగడం వంటివి ఉన్నట్టు తెలిపాయి. జ్వరం, జలుబుతో పాటు వినికిడి సమస్య, తల తిరుగుడు వంటి లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయవద్దని, తక్షణం వైద్య సాయం పొందాలని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు.
అసెంబ్లీ కార్యాలయంలో...
అసెంబ్లీ కార్యాలయంలో ఇవాళ్టి నుంచి మూడు రోజులపాటు టీకా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఉదయం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని శాసన మండలి చైర్మన్ షరీఫ్ ప్రారంభిస్తారు. ముందుగా ఆయనే వ్యాక్సిన్ తీసుకుంటారు.