Corona App C19 Raksha: కరోనా యాప్ కు పెరుగుతున్న ఆధరణ
Corona App C19 Raksha: కరోనాకు సంబంధించి ఏ విషయమైనా అధికంగా చర్చలోకి వస్తుంది.
Corona App C19 Raksha: కరోనా వైరస్ కు సంబంధించి ఏ విషయమైనా అధికంగా చర్చలోకి వస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి వ్యాప్తి, నిరోధం, వాడాల్సిన ఆహారం వంటి విషయాలను అందరూ శ్రద్ధగా చదువుతున్నారు... వింటున్నారు. దీనిలో భాగంగానే ఈ వైరస్ నుంచి ప్రజలను అప్రమత్తం చేసే విధంగా తయారు చేసిన ఒక యాప్ ను అధికశాతం డౌన్లోడ్ చేసుకుని వినియోగించుకుంటున్నారు.
నరసరావుపేట యువకుడు గాయం భరత్‌కుమార్‌రెడ్డి రూపొందించిన కోవిడ్–19 లక్షణాలను ట్రాక్ చేసే వెబ్ అప్లికేషన్ (యాప్)కు ఆదరణ లభిస్తోంది. గుంటూరులో బీటెక్ పూర్తి చేసి ప్రస్తుతం బెంగళూరులో ప్రైవేటుగా 'సైబర్ సెక్యూరిటీ కన్సల్టెన్సీ' నిర్వహిస్తున్న భరత్ లాక్‌డౌన్ నేపథ్యంలో నరసరావుపేటకు వచ్చాడు. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ కలవరపాటుగా మారిన నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసేలా ఒక యాప్‌ను రూపొందించాలనే ఆలోచన చేశాడు. ఈ నేపథ్యంలోనే రెండు నెలల క్రితం తాను రూపొందించిన 'సీ19–రక్ష' యాప్‌ను ఇప్పటి వరకు 27,500 మంది ఉపయోగించుకున్నట్టు తెలిపాడు. కరోనా నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఈ యాప్‌ను రూపొందించినట్టు వివరించాడు.
► ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో రూపొందించిన "www.c19raksha.in' వెబ్ అప్లికేషన్ ఇది. ఇంట్లో కూర్చొని కంప్యూటర్, మొబైల్, ల్యాప్‌టాప్‌ల ద్వారా ఈ యాప్‌ను ఉపయోగించుకుని కేవలం రెండు నిమిషాల్లో మన పరిస్థితి అంచనా వేసుకోవచ్చు.
► ఇందులో కరోనా వ్యాధికి సంబంధించిన సింప్టమాటిక్, అసింప్ట్టమాటిక్ లక్షణాలు, ప్రవర్తనలకు సంబంధించిన ప్రశ్నలను పొందుపర్చాం. ఈ ప్రశ్నావళి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్స్ (ఐసీఎంఆర్) వారు రూపొందించినవి.
► రోగ లక్షణాలు కలిగిన వారు ఈ యాప్‌లో వ్యక్తిగతంగా తమ ఆరోగ్య పరిస్థితిని ప్రశ్నావళి ద్వారా సరిచూసుకోవచ్చు. ఇందులో సులభంగా ఎస్/నో ఆప్షన్లు ఉంటాయి. ఆ వివరాలు వైద్య విభాగానికి నేరుగా మెయిల్ ద్వారా వెళ్తాయి.
► జ్వరం, తలనొప్పి, ప్రయాణ చరిత్ర, ఊపిరి ఇబ్బంది వంటి 11 ప్రశ్నలకు ఇచ్చే సమాధానాలు బట్టి తక్కువ ప్రమాదం, మధ్యస్థం, అత్యధిక ప్రమాదం వంటి మూడు రకాల రిజల్ట్‌లో ఏదో ఒకటి వస్తుంది. అప్లికేషన్‌లో ఇచ్చిన సమాధానాలు బట్టి అత్యధిక ప్రమాదం అనే రిజల్ట్ వస్తే కోవిడ్ పరీక్ష చేయించుకోవాలి. భవిష్యత్‌లో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో కూడా ఈ ఆప్లికేషన్‌లో ఉంది.