Brahmamgari Matam: కొలిక్కి వచ్చిన బ్రహ్మంగారి మఠం పీఠాధిపతి వివాదం!
Brahmamgari Matam: కడప జిల్లా బ్రహ్మంగారి మఠం వివాదంపై అభిప్రాయ సేకరణ పూర్తైంది.
Brahmamgari Matam: కడప జిల్లా బ్రహ్మంగారి మఠం వివాదంపై అభిప్రాయ సేకరణ పూర్తైంది. రెండు రోజులుగా మఠం పీఠాధిపతి అంశంపై చర్చలు జరిపారు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పీఠాధిపతులు. వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి వారసులతో పాటు ధార్మిక సంఘాలు, కందిమల్లయ్యపల్లె ప్రజల అభిప్రాయాలను సేకరించారు. అయితే వీలునామా ద్వారా ఆస్తులను మాత్రమే పంచే హక్కు ఉంటుందన్న శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి ఎండోమెంట్ చట్టం, ప్రజల అభిప్రాయాన్ని బట్టి పీఠాధిపతిపై నిర్ణయం ఉంటుందన్నారు.
రెండు రోజుల పాటు మఠంలో విచారణ జరిపిన పీఠాధిపతులు తమ నివేదికను ప్రభుత్వానికి అందించనున్నారు. ఆ నివేదికను బట్టి ప్రభుత్వం పీఠాధిపతిపై నిర్ణయం తీసుకోనుంది. అయితే పీఠాధిపతి పదవి కోసం పోరాడుతోన్న వారసులు నాలుగు రోజుల సమయం కోరినట్లు విచారణ జరిపిన పీఠాధిపతులు వెల్లడించారు. ఆ తర్వాత సానుకూల నిర్ణయం వస్తందని ఆశాభావం వ్యక్తం చేశారు. త్వరలోనే పీఠాధిపతి పట్టాభిషేక మహోత్సవం జరుగుతుందని వందమంది పీఠాధిపతుల సమక్షంలో పట్టాభిషేక కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. అయితే వీలునామా ఈ విషయంలో చెల్లదన్న పీఠాధిపతులు తేల్చి చెప్పడంతో వీరభోగ వంసత వెంకటేశ్వరస్వామి పెద్దకుమారుడినే పీఠాధిపతిగా నియమించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అయితే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక గురుపీఠంలో ఇలాంటి వివాదం రావడం బాధాకరమన్నారు శైవక్షేత్రం పీఠాధిపతి శివస్వామి. మఠం వైభవాన్ని పెంచేలా చూడాలని పీఠాధిపతి వారసులను కోరినట్లు తెలిపారు. త్వరలోనే మంచి నిర్ణయం వెలువడుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు శివస్వామి.