AP News: ఏపీలో కూటమి సీట్ల సర్దుబాటుపై గందరగోళం
AP News: కూటమి పార్టీల మధ్య కుదరని సఖ్యత
AP News: ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అధికార వైసీపీకి అడ్డుకట్ట వేయాలని పట్టుదలతో టీడీపీ, జనసేన, బీజేపీ ఏకతాటిపైకి వచ్చాయి. అయినా ఆ మూడు పార్టీల మధ్య ఇప్పటికీ సఖ్యత కనిపించటం లేదు. సీట్ల సర్దుబాటు కూడా పూర్తి కాలేదు. అభ్యర్ధులను ప్రకటించిన తోట్ల గందరగోళం నెలకొంది. కొన్ని చోట్ల అసంతృప్తులు భగ్గుమంటున్నారు. మరికొన్ని చోట్ల రెబల్స్ గా బరిలోకి దిగేందుకు సిద్ధమవుతున్నారు.
ఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలన్న లక్ష్యంతో టీడీపీ, జనసేన, బీజేపీ జట్టు కట్టాయి. పలు దఫాలుగా చర్చలు జరిపిన అనంతరం టీడీపీ 144 అసెంబ్లీ, 17 లోక్ సభ స్థానాల్లోనూ.. జనసేన 21 అసెంబ్లీ, రెండు పార్లమెంట్ స్థానాల్లో.. బీజేపీ పది అసెంబ్లీ, ఆరు ఎంపీ స్థానాల్లో పోటీ చేసేందుకు అవగాహనకు వచ్చాయి. ఏ ఏ స్థానాల్లో ఎవరెవరూ పోటీ చేయాలనే దానిపై కూడా క్లారిటికీ వచ్చాయి. అభ్యర్థులను కూడా మూడు పార్టీలు ప్రకటించాయి. అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. సీట్లు దక్కని కీలక నేతలు భగ్గుమంటున్నారు. దీంతో సమస్య మళ్లీ మొదటికొచ్చింది.
ప్రస్తుతం మూడు పార్టీల నేతలు ప్రచారంలో బిజీ అయ్యారు. నియోజకవర్గాలకు వెళ్లిన సందర్భంలో ఎదురవుతున్న అసంతృప్తిని చల్లార్చడం నేతలకు తలకు మించిన భారంగా మారుతోంది. సీట్ల సర్ధుబాటుపై పునరాలోచించుకోవాలని మూడు పార్టీలు నిర్ణయించుకున్నాయి. చంద్రబాబు నివాసంలో జనసేన, బీజేపీ కీలక నేతలు సమావేశం అయ్యారు. పవన్ కల్యాణ్, పురందేశ్వరి, సిద్ధార్ధ సింగ్ తో పాటు ఇతర నేతలు ఈ భేటీలో పాల్గొన్నారు. అసంతృప్తులు, పరస్పర సహాకారం లాంటి అంశాలపై చర్చించారు. అవసరమైతే ఒకటి రెండు స్థానాల్లో మార్పులు, చేర్పులు చేయాలని నిర్ణయించారు.
క్షేత్రస్థాయి పరిస్థితులను ఎప్పటికప్పుడు బేరీజు వేసుకుంటూ ముందుకు సాగాలని.. ప్రచారంలో స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉందని కూటమి నేతలు నిర్ణయించుకున్నారు. బలమైన అభ్యర్ధులు ఉన్నచోట్ల అవసరమైతే వాళ్లకే సీటు కేటాయించి కూటమి విజయానికి ముందుకు సాగాలాని భావిస్తున్నారు. అసంతృప్తులను దారికి తెచ్చుకోకపోతే రెబల్స్ బెడద తప్పదని..మొదటికే మోసం వస్తుందని అంచనాకు వచ్చారు. ఒకటి రెండు చోట్ల సీట్లు సర్దుబాటు చేసుకొని ప్రచారంలో స్పీడ్ పెంచాలని.. మూడు పార్టీల నేతలు ఉమ్మడిగా సమావేశాలు నిర్వహిస్తూ ముందుకు వెళితేనే వైసీపీ దూకుడుకు కళ్లెం వేయడం సాధ్యం అవుతుందని భావిస్తున్నారు.