విశాఖ గ్యాస్ లీకేజీపై మే 31 వరకు వివరాలు స్వీకరణ.. జూన్ 17కి నివేదిక
విశాఖపట్నం సమీపంలోని ఆర్ ఆర్ వెంకటాపురంలో ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ నుంచి స్టైరీన్ గ్యాస్ లీకైన దుర్ఘటనలో 12మంది మృతి చెందగా..
విశాఖపట్నం సమీపంలోని ఆర్ ఆర్ వెంకటాపురంలో ఎల్‌జీ పాలిమర్స్ కంపెనీ నుంచి స్టైరీన్ గ్యాస్ లీకైన దుర్ఘటనలో 12మంది మృతి చెందగా.. వందలాది మంది ఆసుపత్రి పాలైన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనపై విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఉన్నత స్థాయి కమిటీ జూన్ 17కి నివేదిక ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇప్పటికే ప్రభుత్వం ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని వివిధ రకాల సంస్థలు, వ్యక్తుల నుంచి మెయిల్ ద్వారా, నేరుగా కమీటీ స్వీకరించింది. కాగా.. నెలాఖరు వరకూ దీన్ని కొనసాగించాలని నిర్ణయించింది.
ఆసక్తి ఉన్నవారు మే 31లోగా convenorhpc@@gmail.com మెయిల్‌కు ఆ వివరాలు పంపించాలని తెలిపింది. జూన్ 10వ తేదీ లోపు పలు నియంత్రణ సంస్థలు, ఎల్‌జీ పాలిమర్స్ ప్రతినిధులు సహా ఇతర స్టేక్ హోల్డర్స్ నుంచి వాటిపై సమగ్ర సమాచారాన్ని కమిటీ తీసుకోనుంది. వీటన్నింటిపై వివరంగా చర్చించి మరో వారంలోగా నివేదిక సమర్పిస్తామని ప్రభుత్వం నియమించిన ఉన్నతస్థాయి కమిటీ ఒక ప్రకటనలో స్పష్టం చేసింది.
ఈ ఘటనపై విచారణకు కమిటీ నలుగురు సాంకేతిక నిపుణులను తీసుకుంది. వారిలో డాక్టర్ అంజన్ రే, డైరెక్టర్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం, డెహ్రాడూన్ (జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ నుంచి), డాక్టర్ ఎస్‌కే నాయక్, డైరెక్టర్ జనరల్, సీపెట్, చెన్నై (కేంద్ర రసాయనాలు, పెట్రోకెమికల్ మంత్రిత్వ శాఖ నుంచి), భగత్ శర్మ, అదనపు డైరెక్టర్, వాతావరణ మార్పుల ప్రాంతీయ కేంద్రం, పుణె (కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ నుంచి), డాక్టర్ ఆర్‌కే ఇళంగోవన్, డీజీ, ఫ్యాక్టరీ అడ్వైజ్ సర్వీస్ అండ్ లేబర్ ఇన్‌స్టిట్యూట్స్, ముంబయి (కేంద్ర కార్మిక, ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ నుంచి).
గ్యాస్ లీకేజీ దుర్ఘటనతో ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ రెండో దశ విస్తరణ సందిగ్ధంలో పడింది. విస్తరణ కోసం నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం, విశాఖపట్నంలోని పోర్టుకు సమీపంలో భూములను ఎల్‌జీ ప్రతినిధులు పరిశీలించారు. ఎల్‌జీ పాలిమర్స్ భవిష్యత్తు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ ఇచ్చే నివేదికపై ఆధారపడి ఉందని మరో అధికారి తెలిపారు.