Crane Accident at Visakha Shipyard: షిప్ యార్డు ఘటనపై రెండు కమిటీలు.. పోలీస్ స్టేషన్లో కేసు నమోదు
Crane Accident at Visakha Shipyard: వరుస ప్రమాదాలు విశాఖను వణికిస్తున్నాయి.
Crane Accident at Visakha Shipyard: వరుస ప్రమాదాలు విశాఖను వణికిస్తున్నాయి. పాలిమర్ గ్యాస్ నుంచి వరుసగా ఈ ప్రమాదాలు చోటు చేసుకోవడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. విశాఖను క్యాపిటల్ గా ప్రకటించిన సంతోషంలో పట్టణవాసులు ఉండగా, తాజాగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో అందరూ ఆవేదన చెందుతున్నారు.
విశాఖ హిందూస్థాన్ షిప్ యార్డు ప్రమాదంపై విచారణకు రెండు కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ ప్రకటించారు. ఆంధ్రా యూనివర్సిటీ మెకానికల్ ఇంజినీరింగ్ నిపుణులతో ఒకటి, ప్రభుత్వ ఇంజినీరింగ్ విభాగం నుంచి మరో కమిటీ వేస్తున్నట్టు తెలిపారు.. ఇందుకు సంబంధించి హెచ్‌ఎస్‌ఎల్ ఛైర్మన్‌తో ఇప్పటికే చర్చించినట్టు చెప్పారు.
హిందూస్తాన్ షిప్ యార్డులో ఘోర ప్రమాదం చోటు చేసుకుని పదకొండు మంది మృత్యువాత పడ్డారు. శనివారం భారీ క్రేన్ ట్రయల్ నిర్వహిస్తుండగా అది కుప్పకూలడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో ముందుగా ఆరుగురు మంది మృతి చెందినట్టు భావించిన సహాయ సిబ్బంది పూర్తిగా శిధిలాలు తొలగించడంతో 10 మృతదేహాలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారు. ప్రమాదంలో మృతి చెందిన వ్యక్తులు వెంకట్రావు, చైతన్య, రమణ, పి.వి. రత్నం, పి నాగ దేవుళ్ళు, సత్తిరాజు, శివ కుమార్, కాకర్ల ప్రసాద్, జగన్, పి భాస్కర్ లుగా గుర్తించారు.
మృతుల్లో నలుగురు హిందుస్తాన్ షిప్ యార్డ్ ఉద్యోగులు, ముగ్గురు ఎం ఎస్ గ్రీన్ ఫీల్డ్ ఉద్యోగులు,ఇద్దరు లీడ్ ఇంజినీరింగ్ కంపెనీ ఉద్యోగులు, మరొకరు ఎమ్మెస్ స్క్వాడ్ సెవెన్ కంపెనీ ఉద్యోగి ఉన్నారు. షిప్ యార్డు ప్రమాదంపై మల్కాపురం పోలీస్ స్టేషన్లో కేసు నమోదయ్యాయి. ఈ ప్రమాద ఘటనపై విచారణకు రెండు కమిటీలు ఏర్పాటు చేశారు. షిప్ యార్డ్ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఓ కమిటీ, ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో మరో కమిటీని ఏర్పాటు చేశారు. ప్రమాదంపై ఏర్పాటు చేసిన రెండు కమిటీలు వారం రోజుల్లోగా నివేదికకు ఇవ్వాలని గడువు నిర్దేశించారు.
క్రేన్ ప్రమాదంలో మొత్తం 11 మంది మృతి చెందారని.. ఎవరూ గాయపడలేదని కలెక్టర్ తెలిపారు. క్రేన్ ఆపరేషన్, మేనేజ్‌మెంట్‌లో మొత్తం మూడు కాంట్రాక్ట్ కంపెనీలు ఉన్నాయని… మృతుల్లో నలుగురు హెచ్‌ఎస్‌ఎల్ ఉద్యోగులు కాగా.. మిగిలిన ఏడుగురు కాంట్రాక్ట్ ఏజెన్సీలకు చెందినవారని వెల్లడించారు.