Collector Imtiaz on Lockdown News: మరోసారి పూర్తిస్థాయి లాక్‌డౌన్.. కలెక్టర్ ఏమన్నారంటే..
Collector Imtiaz on Lockdown News: విజయవాడ నగరంలో ఈ నెల 26 నుంచి వారం రోజుల పాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్ విధిస్తున్నట్టు సామాజిక మాధ్యమాల్లో ఇటీవల విపరీతంగా ప్రచారం జరిగింది. అయితే పూర్తిస్థాయి లాక్‌డౌన్ అమలు చేస్తున్నట్టు జరుగుతున్న ప్రచారం అవాస్తమని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సామాజిక మాధ్యమాల్లో ప్రసారమవుతున్న వార్తలకు ఎటువంటి సంబంధం లేదని ఇవి నిరాధారమైనవిగా గుర్తించాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఇటువంటి నిరాధారమైన వార్తలతో ప్రజలను గందరగోళానికి గురయ్యే ప్రమాదం ఉందని కలెక్టర్ అన్నారు. ఇటువంటి వార్తలు ప్రచారం చెయ్యకుండా.. కరోనా నుంచి ఏ విధంగా గట్టెక్కాలనే సూచనలు, సలహాలు ఇస్తే ప్రజలకు ప్రయోజనం ఉండవచ్చని అన్నారు.
కాగా కృష్ణా జిల్లాలో కరోనా కేసులు రోజుకో విధంగా పెరుగుతున్నాయి. జిల్లాలో గురువారం 230 కేసులు నమోదయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం కేసుల 4482 గా ఉంది. అయితే ఇందులో 3260 మంది కోలుకుని ఆసుప్రతుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 1098 మంది వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందుతున్నారు. ఇక జిల్లాలో కరోనా మరణాల సంఖ్య 124 గా ఉంది. కాగా కరోనా వ్యాప్తి మొదట్లో కృష్ణా జిల్లాలో అత్యధిక కేసులొచ్చాయి. అయితే ప్రస్తుతం రెండు మూడు రోజుల నుంచి కేసుల ఉదృతి కాస్త తగ్గుముఖం పట్టినట్టే అర్ధమవుతుంది.